NationalNews

రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు

Share with

రాష్ట్రపతి పదవికి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము నామినేషన్‌ను దాఖలు చేశారు. ద్రౌపది దరఖాస్తును ఆమోదించడానికి అధికార పార్టీ, కూటమి నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నామినేషన్ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వచ్చారు. ద్రౌపది ముర్మును మొదటగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రపోజ్ చేయగా… ముర్ము అభ్యర్థిత్వం కోసం బీజేపీ నాలుగు సెట్ల నామినేషన్లను సిద్ధం చేసింది. ప్రధానమంత్రితో పాటు, సీనియర్ కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. అంతేకాకుండా, కూటమిలో భాగం కాని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ నాయకుడు విజయసాయి రెడ్డి, బిజెడి నాయకుడు సస్మిత్ పాత్ర కూడా ముర్ము నామినేషన్‌కు మద్దతుగా పార్లమెంటుకు వచ్చారు. ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా ఎన్నికైతే… ఈ పదవిని చేపట్టిన మొదటి గిరిజన నాయకురాలిగా చరిత్ర సృష్టిస్తారు. రెండో మహిళా రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము నిలుస్తారు.