NationalNews

ఉద్ధవ్ ఎండ్ గేమ్… చివరకు మిగిలేది…

Share with

శివసేన రెబల్ నేత ఎక్‌నాథ్ షిండే దూసుకుపోతున్నారు. శివసేనలో ఉన్న 55 మంది ఎమ్మెల్యేలలో తనకు 40 మంది సభ్యుల మద్దతుదంటూ తాజాగా ప్రకటించారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే ఎక్‌నాథ్ షిండే పార్టీలో 37 మంది ఎమ్మెల్యేలుండాలి. ప్రస్తుతం తనకు 50 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటున్న ఎక్‌నాథ్ షిండే వారిలో 40 మంది శివసేన ఎమ్మెల్యేలంటూ బాంబు పేల్చారు. మాపై నమ్మకం ఉన్నవారంతా మాతో కలుస్తారని చెప్పారు. బాల్ థాక్రే సిద్ధాంతాలపై విశ్వాసం ఉన్నవారు కలిసివస్తారన్నారు. తిరుగుబాటుదారులు ఎవరూ కూడా బాల్ థాక్రే స్థాపించిన శివసేన నుంచి బయటకు వెళ్లబోరన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత చట్టవిరుద్ధమన్నారు. అనర్హత వేయాలంటూ స్పీకర్‌ను కోరడం చట్టానికి వ్యతిరేకమని… వారికి అలా నిర్ణయం తీసుకునే హక్కు లేదన్నారు షిండే. ప్రజాస్వామ్యంలో నెంబర్లు కూడా చాలా చాలా ముఖ్యమన్నారు.

ఎమ్మెల్యేలపై వేటు వేసే అధికారం అసలు ఉద్ధవ్ థాక్రే వర్గానికి లేదన్నారు. ఇలాంటి చర్యలతో భయపడబోమన్నారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలంటే షిండే వర్గానికి 37 మంది ఎమ్మెల్యేలు అవసరం కాగా… గురువారం నాటికి ఆయన ఆ నెంబర్ చేరుకున్నారు. అంతే కాకుండా మరో 9 మంది ఎమ్మెల్యేలు సైతం షిండేకు మద్దతుగా నిలిచారు. రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రేకు మధ్య ఎలాంటి చర్చ జరగలేదన్నారు షిండే. 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ థాక్రే కోరిన కొద్ది సేపటికే… ఎక్ నాథ్ షిండే తమ నాయకుడిగా గుర్తిస్తూ.. డిప్యుటీ స్పీకర్ కు 37 మంది ఎమ్మెల్యేలు లేఖ రాశారు. అనర్హత విషయంలో ఉద్ధవ్ థాక్రేకు భయపడే పరిస్థితి లేదని… పదో షెడ్యూల్ ప్రకారం విప్… కేవలం అసెంబ్లీకి మాత్రమే చెల్లుతుందని… సమావేశానికి కాదన్నారు. తాజాగా మరో నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ డిప్యూటీ స్పీకర్ ను ఉద్ధవ్ థాక్రే కోరారు