నాపై వస్తున్న పుకార్లను నమ్మవద్దు..
ప్రముఖ సంగీత విద్వాంసుడు ఇళయరాజా తాజాగా శ్రీవల్లిపుత్తూరు ఆలయాన్ని సందర్శించారు. అక్కడ గర్భగుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆలయ అధికారులు అడ్డుకున్నారు. అతని కులం కారణంగానే ఆయనను అంతరాలయంలోనికి వెళ్లనివ్వలేదని పుకార్లు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరలవుతుండడంతో ఇళయరాజా ఎక్స్ వేదికగా స్పందించారు. “కొందరు నన్ను టార్గెట్ చేసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నా ఆత్మగౌరవానికి ఏ సమయంలోనూ, ఎక్కడా రాజీ పడేదిలేదు, రాజీపడను. జరగని వార్తలను జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, ప్రజలు ఈ పుకార్లను నమ్మ వద్దు’ అని రాసుకొచ్చారు. దీనిపై ఆలయ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. “ఇళయరాజా, సీనియర్ అర్చకులతో కలిసి అర్థమండపం ముఖద్వారం వద్దకు రాగా, వసంత మండపం దాటవద్దని అర్చకులు తెలియజేశారు. తత్ఫలితంగా, ఇళయరాజా వారు చెప్పిన విధంగా తన పూజలు నిర్వహించారు” అని చెప్పారు.

