కేసీఆర్ భ్రమల్లో కొట్టుకుపోవద్దు
రైతులకు రుణమాఫీ చేశామంటున్న సీఎం కేసీఆర్ తెలంగాణ రైతులను బ్యాంకులకు ఎగవేతదారులుగా మార్చారని బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ విమర్శించారు. అదిలాబాద్‌లో ప్రజాగోస – బీజేపీ భరోసా కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. ఏకకాలంలో రుణమాఫీ చేస్తే ఈ సమస్య వచ్చేది కాదని, మహిళా సంఘాల రుణాలకు కూడా వడ్డీ కట్టకుండా కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఫసల్ బీమా లేదు.. వ్యవసాయ పనిముట్లకు సబ్సడీ లేదు.. గ్రీన్ హౌస్‌కు, డ్రిప్‌కు.. దేనికీ సబ్సిడీ ఇవ్వకుండా రైతుబంధు మాత్రమే ఇస్తే ఏం లాభమని ప్రశ్నించారు. 35 లక్షల మంది రైతులను బ్యాంకుల్లో డిఫాల్టర్లుగా మార్చిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.

ప్రజలే ప్రభుత్వానికి డబ్బులిస్తున్నారు..
పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఇతర సంక్షేమ పథకాలన్నీ కలిపితే పేదలకు సీఎం కేసీఆర్ రూ.25 వేల కోట్లు మాత్రమే ఇస్తున్నారని.. గల్లీగల్లీకి బెల్ట్ షాపులు పెట్టి మన దగ్గర మాత్రం రూ.42 వేల కోట్లు గుంజుకుంటున్నారని లెక్కకట్టారు. దీన్ని బట్టి ప్రజలకు కేసీఆర్ ఏమీ ఇవ్వడం లేదని.. ప్రజలే ప్రభుత్వానికి డబ్బులిస్తున్నారని వివరించారు. పేదల ఆకలికి పరిష్కారం చూపాల్సిన బడ్జెట్ సొమ్మును టీఆర్‌ఎస్ ప్రభుత్వం భూస్వాములకు, పెట్టుబడిదారులకు ధారపోస్తోందని ఆరోపించారు.

టీఆర్‌ఎస్‌ను అసెంబ్లీకి శాశ్వతంగా రాకుండా చేస్తాం..
అసెంబ్లీలో మందబలంతో బీజేపీ ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ బయటికి పంపించారని.. వచ్చే ఎన్నికల కోసం పల్లెపల్లెనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశామని.. గులాబీ పార్టీనే శాశ్వతంగా అసెంబ్లీకి రాకుండా చేస్తామని ఈటల శపథం చేశారు. ప్రజలు ఇచ్చిన అధికారంతో కేసీఆర్‌కు కళ్లు నెత్తికెక్కాయని.. తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండా మాత్రమే అని స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని.. అబద్ధాలు ఆడుతూ.. లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్న కేసీఆర్‌ను గద్దె దించడమే మనందరి ఏకైక లక్షంగా ఉండాలని పిలుపునిచ్చారు.

ప్రజా క్షేత్రంలోకి వచ్చా.. ఆపగలరా..
తెలంగాణ ఉద్యమం సమయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక అయిన అసెంబ్లీలో స్పీకర్ పోడియం వద్దే పడుకున్నామని.. ఇప్పుడు అసెంబ్లీలో లేచి నిలబడితేనే సస్పెండ్ చేస్తున్నారని.. పోలీసు వాహనాల్లో ఎక్కించి ఇంటికి పంపిస్తున్నారని.. ఇంతటి దౌర్జన్యం ఏ ప్రభుత్వంలోనూ చూడలేదని ఈటల వాపోయారు. ఇప్పుడు ప్రజల్లోకి వచ్చానని.. ఇక్కడ ఆపగలరా.. అని కేసీఆర్‌కు సవాల్ చేశారు. కేసీఆర్ గుండాగిరి ఎంతో కాలం చెల్లదని.. తమకూ ఓ రోజు వస్తుందని జోస్యం చెప్పారు.

జోగు రామన్నకు పరామర్శ..
ఈటల రాజేందర్ అదిలాబాద్‌లో మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత జోగు రామన్న ఇంటికి వెళ్లారు. రామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ (98) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. దీంతో రామన్నను పరామర్శించిన ఈటల.. బోజమ్మ చిత్రపటం వద్ద పూలుజల్లి నివాళి అర్పించారు. రామన్నతో కొద్దిసేపు ముచ్చటించి ‘ప్రజాగోస – బీజేపీ భరోసా’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు.

