ఏపీ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా విభేదాలు
◆ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు పై కన్నా విమర్శలు
◆ జిల్లా అధ్యక్షులను మార్చడంతో కన్నా ఆగ్రహం
◆ ఆరా తీస్తున్న జాతీయ నాయకత్వం
ఏపీ బీజేపీలో నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఇద్దరు ప్రధాన నేతల మధ్య విభేదాలు ఇప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారాయి. రెండు నెలల క్రిందట పార్టీ అంశాలపై విమర్శలు చేసిన మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరోసారి ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మూడు రోజుల క్రితం ఆరు జిల్లాల అధ్యక్షులు మార్చడమే కన్నా విమర్శలకు కారణంగా చెబుతున్నప్పటికీ అంతర్గతంగా కన్నా లక్ష్మీనారాయణ జనసేన వైపు చూడటమే కారణం అని బీజేపీలోని కొందరు నేతలు చెబుతున్నారు. బీజేపీలో ఎప్పటినుంచో అసంతృప్తిగా ఉన్న లక్ష్మీనారాయణ గత అక్టోబర్‌లో రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పై ఆరోపణలు సంధించారు. కోర్ కమిటీ సమావేశాలు సక్రమంగా నిర్వహించటం లేదని నిర్వహించిన అక్కడ తీసుకునే నిర్ణయాలు అమలు కావటం లేదని జనసేనతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు చేశారు.

అయితే పార్టీ కేంద్ర నాయకత్వం నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో అప్పట్లో కన్నా సైలెంట్ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ ఇటీవల జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కలవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గంటకు పైగా ఇద్దరు మధ్య జరిగిన భేటీ లో రాజకీయం ఏమి లేదంటూ ఇద్దరు కూడా మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. మూడు రోజుల కిందట ఆరు జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు మార్చారు. శ్రీకాకుళం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, కృష్ణా, నరసరావుపేట, ప్రకాశం జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించడంతోపాటు ఇప్పటివరకు ఆయా జిల్లాల అధ్యక్షులుగా కొనసాగిన వారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమించారు. తన హయాంలో నియమించిన జిల్లా అధ్యక్షులు మార్చటంపై కన్నా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా బయటకు కనిపించని పలు కారణాలు కన్నా ఆగ్రహానికి అసంతృప్తికి కారణాలుగా పలువురు చెబుతున్నారు.

ఏపీలో రాష్ట్ర నేతలు విభేదాలు వీడి కలిసికట్టుగా పని చేయాలని తిరుపతి పర్యటనలో గత ఎడాది హోం మంత్రి అమిత్ షా సూచనలు, సలహాలు ఇచ్చినా కొందరు నేతలు బహిరంగ వ్యాఖ్యలు చేయటంతో దీనిపై మరోసారి జాతీయ నాయకత్వం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా బహిరంగ ఆరోపణలపై బీజేపీ సీరియస్‌గా వ్యవహరిస్తోంది. నేతల హోదాతో సంబంధం లేకుండా చర్యలు తీసుకోవడంలో బీజేపీ అధిష్టానం ఏమాత్రం ఎప్పుడు వెనకాడదు. మరి కన్నా వ్యాఖ్యలు నేపథ్యంలో జాతీయ నాయకత్వం ఏవిధంగా ముందుకు వెళ్తుందనేది ఇప్పుడు సర్వత్ర ఆసక్తి నెలకొంది.

