వన్డే కెప్టెన్‌గా ధావన్.. దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు రేపు జట్టు ఎంపిక
దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించనుంది. అయితే.. ట్వంటీ20 ప్రపంచ కప్-2022కు ఎంపిక చేసిన భారత జట్టు ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వనున్నారు. ఆ జట్టు అక్టోబరు 6వ తేదీన ఆస్ట్రేలియాకు పయనమవుతుంది. అదే రోజు లక్నోలో భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. అందుకే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు కెప్టెన్‌గా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. వైస్ కెప్టెన్ బాధ్యతలు వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు అప్పగించనున్నారు.

భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ట్వంటీ20 వరల్డ్ కప్ కోసం సీనియర్ జట్టుతో ఆస్ట్రేలియా వెళ్లనున్నారు. దీంతో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో పాల్గొనే జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్ బాధ్యతలు చేపట్టనున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్-ఏతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో రాణిస్తున్న భారత ఆటగాళ్లను దక్షిణాఫ్రికా సిరీస్‌కు ఎంపిక చేసే అవకాశం ఉంది. అందుకే భారత్-ఎ, న్యూజిలాండ్-ఎ జట్ల మధ్య జరిగే 3వ వన్డే మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా సిరీస్‌కు జట్టును సెలెక్టర్లు ఎంపిక చేస్తారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. భారత్‌లో సౌతాఫ్రికా మూడు ట్వంటీ20 మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ నెల 28వ తేదీన త్రివేండ్రంలో జరిగే తొలి ట్వంటీ20 మ్యాచ్‌తో దక్షిణాఫ్రికా టూర్ ప్రారంభం కానుంది.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు (అంచనా): శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, షాబాజ్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రజత్ పాటిదార్, పృథ్వీ షా, శార్దూల్ ఠాకూర్, సంజు శాంసన్ (వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), కుల్దీప్ యాదవ్, రాహుల్ త్రిపాఠి, ఉమ్రాన్ మాలిక్, ప్రసిద్ధ్ మాలిక్, కుల్దీప్ సేన్.

