NationalNews

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్

Share with

మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో… కొత్త సీఎంగా బీజేపీ కీలక నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. శివసేన రెబల్ నేత ఎక్‌నాథ్ మద్దతుతో మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు ఫడ్నవీస్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఢిల్లీ పెద్దల నుంచి వస్తున్న ఆదేశాలతో ఆయన వడివడిగా అడుగులు వేస్తున్నారు. మహారాష్ట్ర సీంగా ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. ముంబై తాజ్ హోటల్లో మిఠాయిలు పంచుకొని ఒకర్ని ఒకరు అభినందించుకున్నారు.

మాజీ సీం ఫఢ్నవీస్ ట్విట్టర్ లో మరాఠిలో చేసిన కామెంట్స్ ఆసక్తిని కలిగించాయ్. నేను మళ్లీ వస్తున్నా… కొత్త మహారాష్ట్రను నిర్మించేందుకు… జై మహారాష్ట్ర అంటూ దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో చీకటి అధ్యాయం ముగిసిందన్నారు. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ ట్విట్టర్‌లో ఉద్ధవ్ థాక్రేపై తీవ్ర విమర్శలు చేశారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మహారాష్ట్రకు సంకీర్ణ సర్కారు శాపంగా మారిందన్నారు. సిద్ధాంత వైరుధ్యాలు, అవినీతితో గత పాలకులు మహారాష్ట్ర పరువు తీశారన్నారు. పాలన వ్యవస్థను భ్రష్టు పట్టించారన్నారు. మరాఠా ఆర్థిక ప్రగతి, పారిశ్రామికరంగం కుంటుబడ్డాయన్నారు. వాస్తవానికి ఇవాళ ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరగాల్సి ఉంది. ఉద్ధవ్ థాక్రేకు పార్టీలో మద్దతుదారులు కేవలం 15 మంది మాత్రమే మిగలడంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.

సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బతో ఉద్ధవ్ రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. చివరి రోజు మూడు నగరాల పేర్లను మార్చి అందరి దృష్టిని ఆకర్షించిన ఉద్ధవ్…. సహకరించిన మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరిగితే… రాష్ట్రమంతటా… శివసైనికుల రక్తతర్పణం అవుతుందని… అది ఇష్టం లేకనే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఉద్ధవ్ ప్రకటించారు. ఎవరికైతే అవకాశాలిచ్చి అందలం ఎక్కించామో వారే ఇవాళ వెన్నుపోటు పోడిచారంటూ ఉద్ధవ్ ఆవేదన వెళ్లగక్కారు.