ఢిల్లీ ముఖ్యమంత్రి సంచలన ఆరోపణలు
కేంద్ర ప్రభుత్వంపై ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ సంచలన ఆరోపణలు చేశారు. తమ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. ఆమె పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే కేజ్రీవాల్ రక్షణ కోసం పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చిన భద్రతా బృందాన్ని బీజేపీ సారథ్యంలోని కేంద్ర సర్కార్ ఉపసంహరించిందంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ భద్రతను పునరుద్ధరించాలని కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే ఈ అంశంపై స్పందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లో పనిచేస్తున్నారని, కేజ్రీవాల్‌పై ఎన్నో దాడులు జరుగుతుంటే కూడా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

