పాడిపశువులు ఆన్‌లైన్లో…ఐఐటీ అమ్మాయిల వినూత్న ఆలోచన
ఇద్దరు ఐఐటీ అమ్మాయిల ఆలోచన వారి జీవితాలనే మార్చేసింది. వ్యవసాయ కుటుంబాలలో పుట్టి పెరిగిన వీరికి రైతుల కష్టాలు తెలుసు. టెక్నాలజీ సహాయంతో రైతుల జీవితాలలో మార్పులు తీసుకురావాలని తాపత్రయపడ్డారు వీరిద్దరూ. బెంగళూరు అమ్మాయి నీతూ యాదవ్, గురుగ్రామ్‌కు చెందిన కీర్తి జంగ్రా ఢిల్లీ ఐఐటీలో కలిసి చదువుకున్నారు. వీరిద్దరూ అక్కడే మంచి స్నేహితులయ్యారు. ఇద్దరూ వ్యవసాయ ఆధారిత కుటుంబం నుండి వచ్చినవారే. చిన్ననాటి నుండి పాలవ్యాపారం, పాడిపశువులను చూసి పెరిగిన వారికి ఉద్యోగాలలో నెలవారీ జీతం తీసుకుంటూ మామూలు జీవితం గడపడం నచ్చలేదు. ఏదైనా మంచి వ్యాపారం చేయాలనుకున్నారు.

పశువుల అమ్మకం, కొనుగోలు వ్యవహారాలు చాలా కష్టంతో కూడుకున్నది. దళారీ వ్యవస్థ కారణంగా రైతులకు సరైన గిట్టుబాటు ధర లభించడం లేదు. ఈ విషయం గురించి బాగా ఆలోచన చేసి, వారు దీనినే వ్యాపార సాధనంగా మార్చుకుందామనుకున్నారు. ఈ ఆలోచనతోనే 2019లో (Animall) యానిమాల్ అనే యాప్‌ను డెవలప్ చేశారు. దీనిద్వారా తమ వద్ద ఉన్న పాడి పశువును అమ్మాలనుకునే వ్యక్తి దానికి సంబంధించిన ఫొటో లేదా వీడియోను అప్‌లోడ్ చేసి, అది ఏ రకం జాతికి చెందిన ఆవు ? ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది? దాని ధర ఎంత ? అనే వివరాలు పొందుపరిస్తే చాలు. కొనుగోలు దారులు తమకు కావల్సిన పశువులను కొనుగోలు చేయడానికి నేరుగా ఆ రైతుకే ఫోన్ చేసి ధర మాట్లాడుకోవచ్చు.

దీనిద్వారా దళారీలతో సంబంధం ఉండదు, అందువల్ల సరైన ధరను రైతు పొందగలుగుతాడు. దీని ఉపయోగాల వల్ల దీనిని ఇప్పటివరకూ 80 లక్షల మందికి పైగా రైతులు డౌన్‌లోడ్ చేసుకున్నారు. ప్రతీసంవత్సరం లక్షలాది క్రయవిక్రయాలు దీనిద్వారా జరుగుతున్నాయి. ఈ యాప్ ద్వారా వీరిద్దరూ కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వీరి నిర్ణయాన్ని మొదట్లో బంధుమిత్రులు వ్యతిరేకించారు. ఐఐటీ చదివి పశువుల వ్యాపారమేంటని తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించలేదు. కానీ ఇప్పుడు వీరి విజయాన్ని చూసిన వారే ఎంతో మెచ్చుకుంటున్నారు. వీరు ఫోర్బ్ అండర్ 30 లో కూడా స్థానం సంపాదించారు. ఎంతోమంది యువతకు ఆదర్శమయ్యారు.

