తృణమూల్ ఎమ్మెల్యే ఇంట్లో కోట్ల రూపాయలు లభ్యం
పశ్చిమబెంగాల్‌లో నోట్ల కట్టలు వరదలై పారుతున్నాయి. తాజాగా ఐటీ శాఖ జరిపిన దాడులలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇంట్లో 11 కోట్ల రూపాయల మేరకు నోట్లకట్టలు లభ్యమయ్యాయి. ఇవన్నీ లెక్కలోకి వచ్చిన సొమ్మేనా అని అధికారులు ఆరా తీస్తున్నారు. తృణమూల్ ప్రభుత్వానికి చెందిన మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అయిన జాకీర్ హుస్సేన్ నివాసంలో ,కార్యాలయాలలో ఐటీ అధికారులు దాడులు చేశారు. బుధవారం ఉదయం నుండి గురువారం ఉదయం వరకూ ఈ తనిఖీలు కొనసాగాయి. ఆయన ఇల్లు, బీడీ ఫాక్టరీ, నూనెమిల్లు, రైస్ మిల్లులో కోల్‌కతా, ముర్షిదాబాద్‌లోని 20 ప్రాంతాలలో ఒక్కసారిగా సోదాలు జరిగాయి. ఈ సోదాలలో 11 కోట్ల రూపాయల నోట్లకట్టలను కనిపెట్టారు. ఈ దాడులపై జాకీర్ స్పందిస్తూ, తనవద్ద ఆ డబ్బుకు తగిన ఆధారాలు ఉన్నాయన్నారు. తనకు సంబంధించిన ఫాక్టరీలు, మిల్లుల్లో దాదాపు 7 వేల మంది కూలీలు పని చేస్తున్నారని, వారికి జీతభత్యాలు ఇచ్చేందుకే ఆ నగదును ఆఫీసులో ఉంచామని పేర్కొన్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మంత్రి మాట్లాడుతూ జాకీర్ సంపన్న వ్యాపారవేత్త అని చాలామంది ఉద్యోగులు ఆయన వద్ద పని చేస్తున్నారన్నారు.

అయితే ఇంతకు ముందు కూడా తృణమూల్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇంట్లో కోట్ల కొలది నగదు దొరికిన విషయం తెలిసిందే. గత ఏడాది తృణమూల్ కాంగ్రెస్ నేత పార్థా చటర్జీ, ఆయన సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో కూడా కోట్ల రూపాయలు దొరికాయి. ఈ విషయం బెంగాల్ రాజకీయాలలో సంచలనం రేపింది. అయితే బెంగాల్ ప్రభుత్వం ఈదాడులను ఖండిస్తూ, కేంద్రప్రభుత్వం దర్యాప్తుసంస్థలను దుర్వినియోగం చేస్తోందని, తృణమూల్ నేతలపై కక్షసాధింపు చేస్తోందని ఆరోపిస్తోంది.

