Andhra PradeshNews

కాంగ్రెస్ యోధుడు వైఎస్సార్

  • ఓటమి ఎరుగని మేరునగధీరుడు
    పేదలకు విద్యా, వైద్యం అందించిన ధీరుడు
    రైతులకు ఉచిత విద్యుత్

తెలుగు రాజకీయాల్లో ఆయన రూటే సెపరేట్. ఆయన రాజకీయాలు చేసినట్టుగా వేరెవరు కూడా చేయరంటే అతిశయోక్తి కాదు. రాజకీయాల గురించి చెప్పాలంటే వైఎస్‌కు ముందు… వైఎస్ తర్వాత అని చెప్పాల్సిందే. అధికారం కోసం ఎన్నాళ్లూ వేచి ఉన్న రాజశేఖర్ రెడ్డి వచ్చిన అధికారాన్ని ప్రజల కోసమే ఉపయోగించారు. ఏదైనా చేయాలంటే రాజశేఖర్ రెడ్డి తర్వాతే ఇంకెవరైనా అనుకునేలా పాలన సాగించాడు. ఒడిదుడుకులెన్ని ఎదురైనా మొక్కవోని ధైర్యంతో పార్టీలో అంచలంచెలుగా ఎదిగారు. 1978లో తొలిసారి అసెంబ్లీకి వైఎస్సార్ ఎన్నికయ్యాడు. నాడు నుంచి రాజకీయాల్లో ఓటమన్నది ఎరుగలేదు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 6సార్లు, కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు వైఎస్సార్ విజయం సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన మొదటిసారే మంత్రి పదవిని దక్కించుకున్నారు.

ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ పులివెందుల నుంచి విజయం సాధించారు వైఎస్సార్. కడప లోక్‌స‌భకు వరుసగా 4 సార్లు ఎన్నికై చరిత్ర సృష్టించారు. 9,10,11,12 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ ప్రత్యర్థుల్ని చిత్తు చిత్తు చేశారు. ఇక 1999లో టీడీపీని ఓడించి అధికారంలోకి రావాలన్న ఉద్దేశంతో ఆయన అసెంబ్లీ బరిలో దిగాలని ఏర్పాట్లు చేసుకున్నారు. 1999 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తు, కార్గిల్ యుద్ధం జరగడం, చంద్రబాబు వ్యూహాలతో నాడు కాంగ్రెస్ పార్టీ పుంజుకున్నప్పటికీ… ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. టీడీపీ ఆ ఎన్నికల్లో ఘన విజయం సాధించినా… వైఎస్సార్ మాత్రం సీఎల్పీ నాయకుడిగా పార్టీని ముందుకు నడిపించాడు. 1999 ఎన్నికల్లో పనిచేసిన అనుభవం వైఎస్సార్‌కు 2004లో కలిసొచ్చిందని చెప్పాలి. సీఎల్పీ నేతగా ఉంటూ జిల్లాల వారీగా తనకంటూ ఒక వర్గాన్ని తయారు చేసుకొని పార్టీని విజయతీరాలకు చేర్చే వ్యూహాన్ని అమలు చేశారు. తెలంగాణకు జైకొట్టిన వైఎస్సార్, టీఆర్ఎస్ పార్టీతో పొత్తుపెట్టుకొని 2004 ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారీ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీకి జవజీవాలు తెచ్చారు. మండుటెండలో ఆరోగ్యాన్ని లెక్కచేయకుండా వైఎస్సార్ సాగించిన ప్రజాప్రస్థానం యాత్ర… ఆయనను తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేసిన 234 నియోజకవర్గాల్లో 185 స్థానాల్లో విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్‌లో తిరుగులేని నాయకుడిగా వైఎస్సార్ ఆవిర్భవించాడు. ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన చేసిన సంక్షేమ యజ్ఞం నిరుపేదల్లో గుర్తింపు తెచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ అందించి… ఆయన ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాడు. ఆరోగ్యశ్రీ పథకంతో తెల్లకార్డు ఉన్నవారందరికీ ఉచిత వైద్యం అందించాడు. 108 అంబులెన్స్ సర్వీసులను పటిష్టవంతం చేశాడు. పావలా వడ్డీకి రుణాల స్కీమ్ ద్వారా డ్వాక్రా మహిళలకు సాయమందించాడు. రెండు రూపాయలకే కిలో బియ్యాన్ని అందించాడు. కుటుంబంలోని అర్హులందరికీ పింఛన్లు అందేలా చేసి… పేద ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు వైఎస్. 60 ఏళ్లు దాటిన వారందరికీ అభయహస్తం ద్వారా నెల నెల 500 రూపాయల నుంచి 2 వేల పింఛన్ అందించే కార్యక్రమాన్ని అమలు చేశాడు. ఉద్యోగాల నోటిఫికేషన్లతో ఎందరో నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించాడు. ఇందిరమ్మ ఇళ్లతో రాష్ట్ర వ్యాప్తంగా భారీగా గృహనిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టాడు. ముఖ్యంగా పేదవారు పెద్ద చదువులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్ అమలు చేశాడు. పేదలకు ఏవైతే ఎక్కువ అవసరమో… అంటే విద్యా, వైద్యం విషయంలో ప్రభుత్వ పాత్రను ఆయన పునర్విర్వచించారు. అదే సమయంలో జలయజ్ఞమంటూ లక్ష కోట్ల రూపాయలతో ప్రాజెక్టులు నిర్మించినా… వాటిపై ఎన్నో అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయ్. విమర్శలెన్నివచ్చినా అవన్నీ కూడా 2009 అసెంబ్లీ ఎన్నికల విజయంతో దూదిపింజలైపోయాయి.

2004లో టీఆర్ఎస్ పార్టీతో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ… 2009లో సొంతంగా పోటీ చేసి విజయం సాధించగలదన్న దీమాను అందించారు వైఎస్సార్. రెండోసారి ఎన్నికలకు వెళ్లేటప్పుడు కొత్త స్కీములు ఏవీ పెట్టకుండానే విజయం సాధించి… తనకు ప్రజల్లో తిరుగులేని మద్దతు ఉందని రుజువు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినా, టీడీపీ, టీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలతో కలిసి కూటమి కట్టినా.. కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చి ఔరా అన్పించుకున్నారు వైఎస్సార్. 2009లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీ సీట్లే… 33 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి పార్టీలో ఇక తనకు తిరుగులేదనిపించుకున్నారు. వైఎస్సార్. విమర్శలు ఎన్నొచ్చినా వాటిన్నింటినీ చిత్తు చేసి… తనకు కాంగ్రెస్ పార్టీలో అడ్డులేకుండా చేసుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ… మృత్యుఒడిలోకి చేరారు. అందుకే ఆయన చనిపోయినప్పుడు ఎందరో గుండెలు ఆగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గురించి చెప్పాలన్నా… కాంగ్రెస్ రాజకీయాల గురించి చెప్పాలన్నా వైఎస్ ముందు.. తర్వాత అని చెప్పాల్సిందే. ప్రేమ చూపించడంలోనైనా, పగలోనైనా వైఎస్‌కు సాటి మరొకరు రారంటే అతిశయోక్తి కాదు. సాయం కోసం పగవాడొచ్చినా… చేయిందించే అరుదైన మనస్తత్వం ఒక్క రాజశేఖర్ రెడ్డిలో మాత్రమే ఉందంటారు. అందుకే ఆయనకు కాంగ్రెస్ పార్టీలోనే కాక… అన్ని రాజకీయ పార్టీల్లోనూ ఆయనను అభిమానించే నాయకులుంటారు. అందుకే నేటికీ తెలుగు ప్రజల గుండెల్లో ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారు.