కోమటిరెడ్డి రాజీనామాతో కాంగ్రెస్ హైకమాండ్ షాక్
తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సమాజం గమనిస్తోందంటూ కాంగ్రెస్ హైకమాండ్ అభిప్రాయపడింది. ఇతర పార్టీలో గెలిచిన వారిని తీసుకోవడం ఎందుకని ప్రశ్నించింది. దేశానికి సిద్ధాంతాలు నేర్పుతున్నామన్న బీజేపీ నీతి తప్పుతుందని విమర్శించింది. లోక్‌సభ సాక్షిగా తెలంగాణ ప్రజలను మోదీ అవమానించారని… తెలంగాణ ప్రజలు మోదీని బహిష్కరించాలని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. మోదీ విసిరే ఎంగిలి మెతుకులకు, కాంట్రాక్టులకు ఆశపడి కొంతమంది పార్టీకి… ప్రజలకు ద్రోహం చేస్తున్నారన్నారు.
ఈడీ బీజేపీ ఎలక్షన్ డిపార్టుమెంట్‌గా మారిందని కాంగ్రెస్ దుయ్యబట్టింది. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీని, నాయకులను ఈడీ ద్వారా భయపెడుతున్నారంది. రాజకీయ కక్షల్లో భాగంగా సోనియా గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్నారంటూ పార్టీ ఆక్షేపిస్తోంది. కొంత మంది నేతలను సోనియా గాంధీకి సంఘీభావం తెలపాల్సిన విషయం పక్కన పెట్టి… వీధి పోరాటాలు చేయకుండా అమిత్ షా దగ్గర ఎంగిలి మెతుకులకోసం కక్కుర్తి పడుతున్నారని పేర్కొంది. మునుగోడు ప్రజలు కాంగ్రెస్ పార్టీని, చేతి గుర్తును గెలిపించారని… విశ్వాసఘాతకానికి పాల్పడ్డ , కాంట్రాక్టులకు కక్కుర్తి పడ్డ వ్యక్తికి బుద్ధి చెప్పాలంది కాంగ్రెస్ హైకమాండ్.
వ్యాపారాలు చేసుకునే వ్యక్తికి… ఆయన కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఏం తక్కువ చేసిందని విమర్శించింది. కాంగ్రెస్ పార్టీ ఆదరించకపోతే బ్రాందీ షాపులో పనిచేయడానికి కూడా పనికిరారన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఈ సంస్కృతిని మెదలుపెడితే మోదీ కొనసాగిస్తున్నారు. మునుగోడు ప్రజలు చారిత్రత్మాక తీర్పు ఇస్తారని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడుతోంది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి మునుగోడు ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేస్తారని ట్విస్ట్ ఇచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. క్రమశిక్షణ గల కార్యకర్తగా ఆయన పార్టీలోనే ఉంటారన్నారు.