మోదీ పై కాంగ్రెస్ ఏఐ వీడియో
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అవమానించేలా కాంగ్రెస్ పార్టీ ఒక ఏఐ (AI) జనరేటెడ్ వీడియోను సోషల్ మీడియాలో బుధవారం పోస్టు చేయడం వివాదాస్పదమైంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి మోదీ లేత నీలం కోటు, నల్ల ప్యాంటులో కనిపిస్తూ, కెటిల్ , టీ గ్లాసులు పట్టుకుని, త్రివర్ణ పతాకం ఉన్న కార్పెట్ మీద టీ అమ్ముతున్నట్లు చూపించారు.వైరల్ అయిన ఈ ఏఐ వీడియోపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను మొదట షేర్ చేసి, సైటైరిక్‌గా వ్యాఖ్యలు చేశారు. వీడియో ఏఐ ద్వారా రూపొందించబడినదని స్పష్టంగా తెలుస్తుందని కూడా గుర్తించారు.బీజేపీ నేతలు విమర్శిస్తూ, రేణుకా చౌదరి పార్లమెంట్, సైన్యాన్ని అవమానించిన తర్వాత, రాగిణి నాయక్ మోడీని అపహాస్యం చేశారని అన్నారు. ఓబీసీ కమ్యూనిటీకి చెందిన కష్టపడి పనిచేసే ప్రధానమంత్రిని కాంగ్రెస్ అంగీకరించలేకపోతోందని, ఆయన ‘చాయ్ వాలా’ నేపథ్యాన్ని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయం అని వ్యాఖ్యానించారు. దేశ ప్రధానిని కాంగ్రెస్ పార్టీ 150 సార్లకంటే ఎక్కువ అవమానించినదని, ఆయన తల్లిని కూడా లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేసారని బీజేపీ నేతలు అన్నారు.ప్రధాని మోదీ ‘చాయ్ వాలా’ ప్రచారం నేపథ్యంలో గతంలో కూడా కాంగ్రెస్ నాయకులు వివాదాస్పద ప్రకటనలు జారీ చేశారు. 2014లో మణిశంకర్ అయ్యర్ మోదీ ఎప్పటికీ ప్రధానమంత్రిగా కాలేరని, ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన కాంగ్రెస్ సమావేశంలో టీ అమ్మవచ్చని వ్యాఖ్యలు చేశారు. 2017లో యూత్ కాంగ్రెస్ మేమ్ ద్వారా మోడీని ఎగతాళి చేయడం వివాదాస్పదమైంది.ప్రధాని మోడీ అంతర్జాతీయ కార్యక్రమాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. ఇలాంటి సమావేశాల్లో తీసుకున్న ఫోటోలను తీసుకొని ఏఐ వీడియో తయారు చేయడం రాజకీయంగా వివాదాస్పదమని అనిపిస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై అధికారికంగా స్పందించలేదు.

