తిరకాసులో ఏపీ పొత్తులు..
◆ పవన్ మాతోనే ఉంటారన్న బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
◆ 2024లో చంద్రబాబుకు చివరి ఎన్నికలంటున్న వైసీపీ
◆ ఎటూ తేల్చుకోలేకపోతున్న జనసేనాని
◆ చంద్రబాబుతో పవన్‌కు ప్లస్సా ? మైనస్సా
◆ చంద్రబాబుపై బాణాలు ఎక్కుపెట్టిన వైసీపీ, బీజేపీ
ఏపీలో గడిచిన కొన్ని నెలలుగా రాజకీయ వాతావరణం రోజుకో మలుపు తిరుగుతుంది. గత వారంలో ఏపీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన అనంతరం చాలా వరకు రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. అన్ని పార్టీలు తమ బాణాలను చంద్రబాబుపై ఎక్కుపెడుతున్నాయ్. ఈ నేపథ్యంలోనే గురువారం బీజేపీ, వైసీపీ పార్టీలు చంద్రబాబుపై పలు ఘాటు విమర్శలు చేశాయి. రాష్ట్రంలో టీడీపీ రాజకీయ భవిష్యత్ అంధకారంలో ఉందని ఎంపీ జివిఎల్ నరసింహారావు అన్నారు. అందుకే ఆయన అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని చెప్పారు. జనసేన బీజేపీతోనే కొనసాగుతుందని క్లారిటీ రావడంతో చంద్రబాబు నిరాశ భయంతో పలు వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. అలానే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ బీజేపీతోనే కలిసి పోటీ చేయాలని తమ పార్టీ ఢిల్లీ పెద్దలు చెప్పారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా తెలిపారు. జనసేన బీజేపీతోనే కలిసి పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ తమతోనే ఉంటారని కుటుంబ పార్టీ టీడీపీతో కలిసే ప్రసక్తే లేదని పవన్ కళ్యాణ్ కు స్పష్టంగా ఆదేశాల అందాయని అన్నారు. 2024 ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు.

ఇక అధికార పార్టీకి చెందిన వైసీపీ పెద్దలు, మంత్రులు చంద్రబాబుపై పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. మూడుసార్లు సీఎంగా చేసి ఏం పీకావని చివరి ఛాన్స్ ఇవ్వాలంటూ చంద్రబాబు మళ్ళీ కొత్త బిచ్చగాడు లా జనం మీద పడ్డారంటూ ఆ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కుల పిచ్చితో రాష్ట్రాన్ని మూడు దశాబ్దాలు సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. చంద్రబాబుకు 2024 ఎన్నికలే చివరివని భార్యను బయటకు లాగి సానుభూతి డ్రామాలు చంద్రబాబు ఆడుతున్నారని ఏపీ మంత్రులు ఎద్దేవా చేస్తున్నారు. ఇలా చంద్రబాబుపై బీజేపీ, వైసీపీలు బాణాలు ఎక్కు పెట్టి పలు విమర్శలు చేస్తోండటంతో ఈ తాజా పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ డైలమాలో పడినట్లు తెలిసింది. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవాలి అనే దానిపై ఆయన ముందు నాలుగు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఇందులో గతంలోలా ఒంటరిగా పోటీ చేయడం, బీజేపీతో కలిసి వెళ్లడం, టీడీపీ-బీజేపీతో కలిసి వెళ్లడం, కేవలం టీడీపీతో మాత్రమే కలిసి వెళ్లడం ఉన్నాయి. వీటిలో ప్రస్తుత పరిస్థితుల్లో ఒంటరి పోటీ అసాధ్యమే. అలాగే బీజేపీని వదిలేసి కేవలం టీడీపీతో మాత్రమే కలిసి పోటీ చేయడం కూడా అసాధ్యమే. దీంతో టీడీపీ-బీజేపీని కలుపుకుని వెళ్లేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీని ప్రస్తుతానికి వదిలేసి రమ్మని అడుగుతోంది. దీంతో పవన్ చంద్రబాబుతో కలిసి వెళ్లడం ప్లస్సా లేక మైనస్సా అనే అంతర్మథనంలో ఉన్నట్లు తెలుస్తోంది.

వైసీపీ మూడేళ్ల పాలన తర్వాత ఆ పార్టీపై సహజంగా ఉండే వ్యతిరేకతను సొమ్ము చేసుకునే విషయంలో టీడీపీ కంటే జనసేనే ముందన్న సంకేతాల నేపథ్యంలో పవన్ ఆలోచనలు మారుతున్నాయి. మరోవైపు సొంత పార్టీ నేతలు కూడా పవన్‌కు సీఎం పదవి కనీసం షేరింగ్ విధానంలో అయినా ఇవ్వకపోతే చంద్రబాబుతో కలిసి వెళ్లడం అనవసరం అనే భావనలో ఉన్నారు. పవన్ సీఎం అవుతారంటేనే ఈసారి జనసేన నేతలు, కార్యకర్తలు దూకుడుగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో వైసీపీ చెప్పినట్లుగా చంద్రబాబును సీఎం చేసేందుకు పవన్ కష్టపడాల్సిన అవసరం లేదు. కాబట్టి పవన్ వ్యూహాలు ఈ దిశగా ఉండాలనే వాదన పెరుగుతోంది. దీంతో చలికాలంలో ఏపీలో రాజకీయ వేడి రోజురోజుకు రాజుకుంటుంది. భవిష్యత్తులో ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకొని ఎన్నికలు వెళ్తారా అని ప్రజలలో చర్చ జోరుగా సాగుతోంది. జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తే, అధికారంలోకి రావటానికి వైసీపీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని, టీడీపీకి గడ్డు కాలమేనని విశ్లేషకులు కూడా అంటున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.

