Andhra PradeshNews

పాదయాత్రలు అధికారాన్ని కట్టబెడతాయా ?

◆ రాజకీయ పాదయాత్రలకు చిరునామా తెలుగు నేల
◆ భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ
◆ ప్రజల మద్దతు కోసం సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పాదయాత్రలు
◆ ఎన్నికల వేళ రాజకీయ పార్టీల పాదయాత్రలు

భారతదేశంలో ఆధునిక పాదయాత్రలకు ఆద్యుడు మహాత్మాగాంధీ. 1930లో ఆయన ఉప్పు సత్యాగ్రహం పేరిట నిర్వహించిన పాదయాత్ర భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక మైలురాయి. ఆ తరువాత 1933-34లో అంటరానితనానికి వ్యతిరేకంగా మరోసారి దేశవ్యాప్త పాదయాత్ర చేశారు. అనంతరం 1951లో వినోభా భావే భూదాన్ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రాంతం నుంచి మొదలుపెట్టి బీహార్‌లోని బుద్ధగయ వరకు నడిచారు. 1983లో మాజీ ప్రధాని చంద్రశేఖర్ ప్రజల కష్టసుఖాలు, దేశంలో పరిస్థితులు తెలుసుకునేందుకు ఆరు నెలల పాటు 4,260 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ క్రమంలో ఆయన కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు నడిచారు. స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాల కోసం గతంలో జరిగిన పాదయాత్రలు ఇప్పుడు ఎన్నికలలో ప్రజలతో మమేకమై అధికారం చేపట్టటానికి రాజకీయ పార్టీలు ఒక అస్త్రంగా మలుచుకున్నాయి.

త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు వీటికి ముందు కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ రాజకీయ పార్టీలు తమదైన శైలిలో ప్రచారానికి శ్రీకారం చుడుతున్నాయి. ప్రత్యేకించి పాదయాత్రలు బస్సు యాత్రలతో సహా వివిధ రూపాల్లో యాత్రలకు సమాయత్తమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర కొనసాగిస్తున్నారు. రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకోవడానికి ప్రజల మద్దతు కూడగట్టుకోవడానికి ఇప్పటికే అందుబాటులో ఉన్న సోషల్ మీడియాతో పాటు వివిధ రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నాయి. దీంతోపాటు పాదయాత్రల ద్వారా ప్రజలతో మమేకంగా అవడానికి మక్కువ చూపుతున్నాయి. రాహుల్ గాంధీతో సహా పార్టీ నాయకులు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 3570 కి.మీ పాదయాత్ర చేసేందుకు సిద్ధమయ్యారు.

అలానే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజు జనతాదళ్ జన సంపర్క పాదయాత్ర ప్రారంభించగా, బీహార్ లోని పశ్చిమ చంపారన్ నుంచి 3500 కిలోమీటర్లు పాదయాత్రను ప్రశాంత్ కిషోర్ ఆదివారం ప్రారంభించారు. నవీన్ పట్నాయక్ గాంధీ జయంతి సందర్భంగా భువనేశ్వర్‌లోని లింగరాజ్ ఆలయం నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఒడిశా అభివృద్ధిని ప్రజలందరికీ వివరించాలని బీజేడి నాయకులు కార్యకర్తలకు నవీన్ పట్నాయక్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో తిరిగి ప్రవేశానికి ఒక అవకాశంగా ప్రశాంత్ కిషోర్ పాదయాత్రను ఎంపిక చేసుకున్నారని చెప్పొచ్చు. దేశంలో పాదయాత్రలు కొత్తేమీ కాదు. ఇలాంటి యాత్రలు గతంలో అనేకం జరిగాయి. అందులో కొన్ని విజయం సాధించాయి. కొన్ని విఫలమయ్యాయి. 2003లో కాంగ్రెస్ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఏపీలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీని తీసుకువచ్చారు. అనంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన కాలంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు 2013లో పాదయాత్ర చేశారు. 60 ఏళ్లు దాటినా ఆయన ఆరోగ్యపరమైన ఇబ్బందులకు వెరవక పాదయాత్ర పూర్తిచేశారు. 2014లో ఆంధ్రప్రదేశ్‌లో ఆయన పార్టీకి అధికారం దక్కడం, ఆయన ముఖ్యమంత్రి కావడం తెలిసిందే.

అదే సమయంలో వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, జగన్ సోదరి షర్మిల.. 2012 అక్టోబరు 18న ప్రారంభించి 2013 జులై 29 వరకు 230 రోజుల పాటు సుమారు 3 వేల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. 2017లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రను మొదలుపెట్టి ప్రజల్లోకి వెళ్లి 2019లో అధికార పీఠం కైవసం చేసుకున్నారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సైతం విడతల వారీగా పాదయాత్ర చేస్తూ ప్రజల్లో ఉంటున్నారు. తెలంగాణలో షర్మిల తిరిగి పాదయాత్ర నిర్వహిస్తుంటే, రేవంత్ రెడ్డి సైతం పాదయత్రతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. రాజకీయ పాదయాత్రలకు తెలుగు నేల ఒక సక్సెస్ మంత్రంగా కనపడుతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి భారత దేశంలో ప్రస్తుతం చేపట్టిన యాత్రలతో ఆయా రాజకీయ పార్టీలకు ఎలాంటి ప్రయోజనం భవిష్యత్తులో ఉంటుందో చూడాల్సి ఉంది. ఎన్నికల వేళ రాజకీయ పార్టీలకు పాదయాత్రలు ఓ సాంప్రదాయంగా అలవాటుగా మారాయి. రానున్న ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ యువ నేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాదయాత్రలు, బస్సుయాత్రలు చేపట్టనున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. మరి ఈ పాదయాత్రలు అధికారం కైవసం చేసుకోవడానికి ఉపయోగపడతాయా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.