హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు శంకుస్థాపన చేసిన సీఎం కేసీఆర్
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు ఓ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాగా హైదరాబాద్ కోకాపేట్‌లో 400 అడుగుల ఎత్తైన హరేకృష్ణ హెరిటేజ్ టవర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు ముందుగా సీఎం కేసీఆర్‌కు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కాగా సీఎం మాట్లాడుతూ..హైదరాబాద్‌కు అందమైన ఆధ్యాత్మిక కేంద్రం వస్తోందన్నారు. సమాజంలో కొందరు మతపిచ్చితో కల్లోలాలు సృష్టిస్తున్నారన్నారు. కాబట్టి మనమందరం విశ్వశాంతి కొరకు ప్రార్థన చేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ హరేకృష్ణ ఫౌండేషన్ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడుతోందన్నారు. వాటిలో అక్షయపాత్ర తనకు చాలా ఇష్టమని కేసీఆర్ తెలిపారు. ఎంతో చిత్తశుద్ధి ఉంటేనే అలాంటి కార్యక్రమాలు నడుస్తాయన్నారు.ఈ హెరిటేజ్ టవర్ నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వ రూ.25 కోట్లు కేటాయిస్తుందని సీఎం వెల్లడించారు. కాగా ఆ నిధులను త్వరలోనే విడుదల చేస్తాయని సీఎం కేసీఆర్ హామి ఇచ్చారు.

