కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సీఎం జగన్ సాయం
కిడ్నీ సమస్యతో దీర్ఘకాలం నుంచి బాధపడుతున్న ఓ చిన్నారికి సీఎం జగన్ సాయం అందించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న తన కొడుకుని కాపాడాలని సీఎంను సాయం అడిగింది. దీంతో వెంటనే స్పందించిన సీఎం జగన్ తక్షణమే బాలుడి వైద్యం కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. బాలుడి వైద్య ఖర్చుని ప్రభుత్వమే భరిస్తుందని కన్నీటిపర్యంతమైన ఆ తల్లికి హామీ ఇచ్చారు. ఈ ఘటన గురువారం నాడు నంద్యాల జిల్లా పారుమంచాల గ్రామంలో జరిగింది. టీటీడీ ఈవో ధర్మారెడ్డి కుటుంబాన్ని పరామర్శించి తిరిగి వెళ్తున్న సమయంలో పారుమంచాల గ్రామానికి చెందిన మహిళ జయమ్మ సీఎం జగన్ ను కలిసి, తన కుమారుడు యోగి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, డయాలసిస్ చేయించుకుంటూ ఇబ్బందులు పడుతున్నట్లు వివరించింది. కుమారుడికి అవసరమైన వైద్య సహాయం, పెన్షన్ మంజూరు చేయాలని సీఎం జగన్ ను అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన సీఎం నంద్యాల జిల్లా కలెక్టర్‌కు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో నంద్యాల జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ శామూన్ జయమ్మ కుటుంబానికి అవసరమైన సాయం అందించేందుకు అవసరమైన ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.