ముఖ్యమంత్రి రేవంత్ సింగరేణి వేలాన్ని ప్రోత్సహించారు…కేటీఆర్
ఒక ఎంపీగా, పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉండి కూడా రేవంత్ సింగరేణికి ఏమీ చెయ్యలేకపోయాడు, ఒక విధంగా ఈ వేలాన్ని ప్రోత్సహించారు అని కేటీఆర్ తాజాగా ట్వీట్ చేశారు. 2021లోనే కేంద్రప్రభుత్వం సింగరేణిని వేలంపాట పాడినప్పుడు ఒక ఎంపీగా ఏమీ చెయ్యలేకపోయాడని, నాలుగు బొగ్గు గనుల వేలాన్ని ఆపుచేయాలని డిమాండ్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి కూడా డిప్యూటీ సీఎం భట్టిని ఈ వేలంలో పాల్గొనడానికి పంపినందుకు సిగ్గు పడాలి. సింగరేణి ప్రైవేటీకరణలో కేంద్రంతో పాటు రాష్ట్రప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని ఈ సంఘటన వల్ల భావించవలసివస్తోందని కేటీఆర్ ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. కేంద్రం గుజరాత్, ఒరిస్సాలలో గనుల్ని వేలానికి పెట్టకుండా ఎందుకు తెలంగాణ సింగరేణిని మాత్రమే ప్రైవేటీకరణ చేయాలని చూస్తోందో ఆలోచించాలని పేర్కొన్నారు. కార్మికులకు అన్యాయం చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరించారు.

