పద్దతి మార్చుకోండి… 32 మంది ఎమ్మెల్యేలకు జగన్ వార్నింగ్
ఏపీలో వచ్చే ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా తన పార్టీ ఎమ్మెల్యేలతో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలకు అత్యంత చేరువయ్య విధంగా ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. అందులో భాగంగా మే నెల నుండి పలు వర్క్ షాప్‌లు నిర్వహిస్తూ ఎమ్మెల్యేలను ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు సార్లు సమావేశం నిర్వహించిన జగన్ తాజాగా శుక్రవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై తనకు అందిన నివేదికలను సీఎం జగన్ వెల్లడించారు.

ఈ కార్యక్రమం నిర్వహణలో 32 మంది ఎమ్మెల్యేలు వెనక పడ్డారని తెలుస్తోంది. దీంతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారి పనితీరుపై సీఎం జగన్ వివరించారని… అలానే తనకందిన నివేదిక ప్రకారం వెనకబడిన ఎమ్మెల్యేలు తమ తీరు మార్చుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా హెచ్చరించినట్లు తెలుస్తోంది. ఒకవేళ తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారని… మళ్లీ ఏప్రిల్‌లో ఇదే వర్క్ షాప్ ఉంటుందని వెల్లడించినట్లు సమాచారం.

ఏప్రిల్‌లో అభ్యర్థులను ప్రకటిస్తానని… వంద రోజుల్లో పనితీరు మార్చుకోవాలని సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఎమ్మెల్యేలకు ఇదే చివరి సమావేశం అని భావించిన వైసీపీ పార్టీ వర్గాలు మరొక 100 రోజులు ఎమ్మెల్యేలకు జగన్ గడివివ్వడంతో ఇప్పటికైనా పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలతో మమేకం అవ్వాలని, కార్యకర్తలను గుర్తించాలని కోరుతున్నారు. ఏది ఏమైనప్పటికీ గ్రాఫ్ సరిగ్గా లేని ఎమ్మెల్యేలకు మరొక వంద రోజులు గడువు రావటంతో ఊపిరి పీల్చుకున్నారు.

