వైయస్ అవినాష్ రెడ్డికి మరోసారి సిబిఐ నోటీసు
మాజీమంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై సిబిఐ దర్యాప్తులో నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంగళవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు జారీ చేసింది. నోటీసు మేరకు ఉదయం అవినాష్ రెడ్డి సిబిఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతారని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన సిబిఐ విచారణకు గైర్హాజరయ్యారు. తనకు ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున విచారణకు హాజరయ్యేందుకు నాలుగు రోజులు గడువు కావాలంటూ సిబిఐ అధికారులకు లేఖ రాశారు. అదే విషయం మీడియాకు ఆయన తెలిపారు.

అయితే ఆయన లేఖపై సిబిఐ వెంటనే స్పందించలేదు. మధ్యాహ్నం మూడు గంటలకు విచారణకు రావాలని సూచించింది. దీంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. చివరకు ఆయన అభ్యర్థనకు సిబిఐ సమ్మతించింది. ఈ నెల 19న ఉదయం 11 గంటలకు హాజరు కావాలని సిబిఐ తన నోటీసులో పేర్కొంది. హైదరాబాదు నుంచి పులివెందులకు బయలుదేరిన అవినాష్ రెడ్డికి మార్గం మద్యంలోనే ఆయన వాట్సప్ కు సిబిఐ నోటీసులు అందాయి.

మరోవైపు పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటికి మంగళవారం సిబిఐ ప్రత్యేక బృందం చేరుకుంది. మధ్యాహ్నం ఇద్దరు సిబిఐ అధికారులు పులివెందుల చేరుకొని వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటి పరిసరాలు పరిశీలించారు. అవినాష్ రెడ్డి ఇంటికి వివేకా ఇంటికి ఎంత దూరం ఉంది వెళ్లడానికి ఎంత సమయం పడుతుంది అనే దానిపై పరిశీలించినట్లు చెబుతున్నారు. ఇక 19 న విచారణకు రావాలని నోటీసు ఇచ్చేందుకు సిబిఐ అధికారులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఈసారి విచారణకు హాజరు కావాల్సిందేనని సిబిఐ అధికారులు ఆ నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

