వాగులో పడ్డ కారు.. ఏడుగురు మృతి
మెదక్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. శివ్వంపేట మండలం ఉసిరికపల్లి గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న బలెనో కారు అదుపు తప్పి వాగులో బోల్తా పడింది. ఘటనలో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ముగ్గురు పిల్లలు మృతి చెందారు. కారు డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పాముబండ తండాకు చెందిన వారిగా గుర్తించారు. రహదారిపై గుంతల వల్ల కారు అదుపు తప్పి కల్వర్టును ఢీకొంది. ఆ తర్వాత ఎగిరి పక్కనే ఉన్న కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఏడుగురు నీటమునిగి అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వీరంతా తూప్రాన్ దగ్గర ముత్యాలమ్మ గ్రామ దేవత ఆలయానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది.

