ప్రేమజంటను చంపి మొసళ్లకు ఆహారంగా వేసిన కసాయి తల్లిదండ్రులు
పరువు హత్యల పేరుతో ప్రేమికుల ప్రాణాలు తోడేస్తున్నారు కసాయి తల్లిదండ్రులు. మధ్యప్రదేశ్‌లోని మోరెన అనే జిల్లాలో ప్రేమికుల జంటను నిర్థ్యాక్షిణ్యంగా తుపాకులతో కాల్చి చంపారు వారి పెద్దలు. ఇంకా వారిపై కోపం తీరక వారిని చంబల్ ఘరియాల్ అభయారణ్యంలోని రెండువేల కంటే ఎక్కువ మొసళ్లు తిరిగే చంబల్ నదిలో బండరాళ్లు కట్టి మరీ పడేశారు. ఈ దారుణ సంఘటన రతన్ బసాయ్ అనే గ్రామంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన శివాని తోమర్, బాలూపూర్‌కు చెందిన రాధేశ్యామ్ తోమర్ అనే జంట ప్రేమించుకున్నారు. అయితే శివాని పెద్దలకు ఈ ప్రేమ వ్యవహారం నచ్చలేదు. దానితో జూన్ 3న ఇంత దారుణానికి పాల్పడ్డారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

తొలుత రాధేశ్యామ్ తండ్రికి తన కుమారుడు కనిపించకపోవడంతో, అతనిని ప్రేమించిన శివాని తరపు వారే ఏదో చేసి ఉంటారనే అనుమానం వచ్చింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారుకూడా మొదట్లో వారిద్దరూ ఎక్కడికైనా పారిపోయి ఉంటారనుకున్నారు. అయితే దానికి తగిన సాక్షులు లేకపోవడంతో శివాని తల్లిదండ్రులను బంధువులను పిలిచి విచారించారు. వీరి విచారణలో నిజం బయటకు వచ్చింది. వారి మృతదేహాలను బయటకు తీసినప్పటికీ గుర్తించలేనంతగా ముక్కలయ్యాయి.

