Home Page SliderTelangana

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగాంలో గుచ్చుకుంటున్న గులాబీముల్లు

స్టేషన్‌ఘన్‌పూర్‌, జనగాం నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిల స్థానంలో వచ్చే ఎన్నికల్లో కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బరిలో దించే విషయంలో బీఆర్ఎస్ పార్టీ క్లారిటీతో ఉన్నప్పటికీ చిక్కులు తప్పడం లేదు. ఇప్పటికే ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి పోటీ చేస్తాడంటూ కేసీఆర్ ప్రకటించినప్పటికీ, ఆయనకు సపోర్ట్ చేసే విషయంలో రాజయ్య నుంచి సానుకూలత లభించడం లేదు. దీంతో బీఆర్‌ఎస్ నాయకత్వానికి టికెట్ల లొల్లి ఎక్కువవుతోంది. జనగాం స్థానానికి బీఆర్‌ఎస్ నాయకత్వం ఇంకా అభ్యర్థిని ప్రకటించనప్పటికీ, నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

రాజయ్య, ముత్తిరెడ్డిలకు రైతుబంధు, టీఎస్‌ఆర్‌టీసీ రాష్ట్ర చైర్మన్‌ పదవులు కట్టబెట్టేందుకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు ఫార్ములా రూపొందించారని చెప్పినప్పటికీ.. ఎమ్మెల్యే టికెట్లు వదులుకోవడంపై నేతలిద్దరూ అసంతృప్తితో ఉన్నారు. కడియం, పల్లాలు ఇరువురు తమకు ఇచ్చిన ఆఫర్లపై అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. రాజయ్య, ముత్తిరెడ్డి ఇద్దరూ నాయకత్వాన్ని ఒప్పించి తమ టికెట్లు తిరిగి పొందగలమన్న విశ్వాసంతో ఉన్నట్టుగా కన్పిస్తోంది.

కేసీఆర్ మాటలకు కట్టుబడి ఉంటానని మొదట్లో చెప్పిన రాజయ్య తనకు ఇంకా పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉందని చెప్పడంతో నియోజకవర్గంలో పార్టీ కేడర్లో అయోమయం నెలకొంది. పార్టీ అధిష్టానం బి-ఫారమ్‌లు ఇవ్వకముందే ఏదైనా జరగవచ్చని.. రాజయ్య వ్యాఖ్యానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం సమావేశాలపై రాజయ్య అభ్యంతరం వ్యక్తం చేశారు. కేటీఆర్‌ చెప్పినట్లుగా కార్యకర్తలతో సమన్వయ సమావేశం నిర్వహించకముందే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం సరికాదని రాజయ్య అన్నారు.

అదేవిధంగా జనగాంలోనూ పరిస్థితి నెలకొంది. నియోజ‌క‌వ‌ర్గంలో స‌మావేశాలు నిర్వహించ‌డం ద్వారా పార్టీ కార్యక‌ర్తల‌లో చీలిక వ‌స్తోందని ముత్తిరెడ్డి, ఎమ్మెల్సీ పల్లాపై ఆగ్రహంగా ఉన్నారు. గతంలో ప్రత్యేక రాష్ట్రాన్ని వ్యతిరేకించిన పల్లా ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేయడమేంటని ఆయన దుయ్యబడుతున్నారు. ఇదిలా ఉండగా నేతల మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ అధిష్టానం కాస్త ఎక్కువ సమయం తీసుకోవడంతో రెండు నియోజకవర్గాల్లోని బీఆర్‌ఎస్‌ వర్గాల్లో గందరగోళం కనిపిస్తోంది.