అన్నుండు.. బేఫికర్.. మారోరే – షిండే వర్గం వీరంగం
అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదు. అప్పుడే విశ్వరూపాన్ని చూపించడం మొదలు పెట్టింది షిండే వర్గం. ఉద్దవ్ ఠాక్ర్ మద్దతు దారులను టార్గెట్ చేస్తూ రెచ్చి పోతోంది. అడ్డం వస్తే చికబాదండి.. కాళ్ళు విరగొట్టండి.. కళ్ళు పీకేయ్యండి అంటూ ఎవరికి వారే వీరావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. షిండే మెప్పు కోసం శత విధాల ప్రయత్నిస్తున్నారు. వారేం చేస్తున్నారో వారికే తెలియనంతగా ఊగి పోతున్నారు. ఈ కోవలో నిన్న సంతోష్ బంగర్.. నేడు ప్రకాష్ సుర్వే చేరారు. శిష్యుల ఉద్రేకాన్ని చూసి షిండే మురిసి పోతున్నాడు. వెయ్యండిరా .. వీళ్ళకు వీరతాళ్ళు అన్నట్లు మురిపెంగా చూస్తున్నాడు. ఈ పరిణామాలు ఇప్పుడు మహారాష్ట్రలో హాట్ టాపిగ్గా మారాయి.

చేతిలో పదవుంది. చెంతనే కాపాడే నేతన్నాడు. ఇంకేం కావాలి. నిన్న మొన్నటి దాకా నోరు కూడా విప్పడానికి భయపడ్డ నేతలంతా ఇప్పుడు హీరోయిజాన్ని ప్రదర్శిస్తూ రెచ్చి పోతున్నారు. ముఖ్యంగా నిన్నటి దాకా ఉద్ధవ్ అడుగులకు మడుగులొత్తిన వారు .. ఇప్పుడు ఆయన వర్గాన్నే టార్గెట్ చేస్తూ దాడులకు తెగబడుతున్నారు. కనిపించిన వారిని కనిపించినట్లు పిచ్చ కొట్టుడు కొట్టండి… కాళ్ళు విరగాలి.. కళ్ళు పోవాలి అంటూ తమ అనుయాయులను రెచ్చ గొడుతున్నారు. ఉద్దవ్ ఠాక్రే వర్గంపైకి ఎగదోస్తున్నారు. కొడితే షిండేకే జై కొట్టాలి. ఉంటే షిండే వెంటే ఉండాలి. షిండే మాటే శిరోధార్యంగా భావించాలి. లేకపోతే దాడులు తప్పవు అంటూ హెచ్చరిస్తున్నారు. ఈ విషయంలో షిండే వర్గానికి చెందిన ప్రకాష్ సుర్వే రెండాకులు ఎక్కువే చదివాడు. ఏదైనా చేయండి నేను చూసుకుంటా .. అన్నుండు.. బే ఫికర్. షురూ చేయండి అంటూ హింసకు ఆజ్యం పోస్తున్నాడు. కేసులైతే మరుసటి రోజే బెయిల్ తీసుకు వచ్చి విడిపిస్తా అంటూ హామీలు ఇస్తున్నాడు. రౌడీలను .. గూండాలను హల్ ఛల్ చేయమని ప్రేరేపిస్తున్నాడు.

ఎవరినీ వదలొద్దు. వారి స్ధానం ఏంటో వారికి తెలియాలంటే తన్నాల్సిందే అంటూ ప్రకాష్ రెచ్చగొట్టే వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. దీనిపై ఉద్ధవ్ వర్గం సీరియస్ అయ్యింది. ప్రకాశ్ సుర్వే పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలావుంటే.. మధ్యాహ్న భోజనాన్ని నాసిరకంగా అందిస్తున్నారన్న కారణంతో ఓ కేటరింగ్ నిర్వాహకుడిని ఫెడేల్ మంటూ ఒక్కటిచ్చుకున్నాడు షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యే సంతోష్ బంగర్. అంతేకాదండోయ్ ..తనకు తెలిసిన భాషనంతా ఉపయోగించి నోటికొచ్చినట్టు దుర్భాషలాడారు. పూనకం వచ్చినట్లు ఊగి పోయాడు. తిట్ల దండకాన్ని మొదలు పెట్టాడు. ఒక్కసారిగా కళ్ళెర్రజేసి చెంపలు ఫెడేల్ ఫెడేల్ మనిపించాడు. ఈ ఘటన జరిగి రెండు రోజులు కూడా కాక ముందే ఇప్పుడు ప్రకాష్ వ్యవహారం సంచలనంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఉద్దవ్ శిబిరంలో ఉన్న సంతోష్ బంగర్ ,ప్రకాష్ సుర్వే.. ఆ తర్వాత పరిణామాల నేపధ్యంలో ఏక్ నాధ్ షిండే గూటికి చేరారు. నాయకుడి కళ్ళల్లో పడేందుకు హుషారు చూపించడం మొదలు పెట్టారు.

తీవ్ర భయభ్రాంతులకు గురి చేసి ఉద్ధవ్ శిబిరంలో ఎవ్వరూ ఉండకుండా చేయాలన్నది షిండే వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా చెయ్యొచ్చు అని ఎవరికి వారే రెచ్చి పోతున్న వైనం ఇప్పుడు తీవ్ర విమర్శల పాలవుతోంది. కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీలు కూడా ప్రకాష్ వ్యాఖ్యలను, తీరును తీవ్రంగా ఖండించాయి. తమ నేతలను అదుపులో పెట్టుకోవాలంటూ ఏక్ నాధ్ షిండేను హెచ్చరిస్తున్నాయి.

