ప్రాణాలొడ్డి పోరాడిన సైనిక జాగిలం (జూమ్) ఇక లేదు
దేశ సేవలో ప్రాణాలొడ్డి పోరాడిన సైనిక జాగిలం ‘జూమ్’ మనకిక లేదు. ఎంతో ధైర్యసాహసాలతో ముష్కరులకు ఎదురెళ్లి తుపాకీ తూటాలు తగిలినా లెక్కచేయక సైన్యానికి అండగా నిలబడింది ఈ సైనిక తర్ఫీదు పొందిన శునకం. ఈ మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడ్వాన్స్‌డ్ వెటర్నరీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది. తూటాల తాకిడికి గురైన దీనికి సైనిక ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగింది. అనంతరం చికిత్స పొందుతూ అకస్మాత్తుగా ఊపిరి ఎగదన్నడంతో ప్రాణాలు కోల్పోయింది. మొన్న సోమవారం జమ్మూకాశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా తంగపావా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తొయిబా ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు వచ్చిన సమాచారంతో భద్రతా దళాలు జూమ్‌ను తీసుకుని రంగంలో దిగాయి. అది వారిని గుర్తించి వారిపై దాడి చేసింది. వారు తుపాకీతో కాల్పులు జరిపినా వెనక్కి తగ్గలేదు. ఇంతలో అక్కడికి వచ్చిన దళాలు వారిని మట్టుపెట్టాయి. ఈ జాగిలం ఇంతకు ముందు కూడా ఎన్నో ఆపరేషన్లలో విజయవంతంగా పోరాడింది. దీని ధైర్యసాహసాలపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి.

