NewsTelangana

మునుగోడు ఎన్నికల ప్రచారంలో బీజేపీ అగ్రనేతలు

మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ కూడా నేటితో పూర్తికానున్న నేపథ్యంలో ప్రచార పర్వం ఇప్పటికే జోరందుకుంది. ఇక బీజేపీ నుండి ఎన్నికల బరిలోకి దిగిన రాజగోపాల్ రెడ్డి కోసం నేటి నుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎన్నికల ప్రచార పర్వం నిర్వహిస్తుండగా… రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ నియోజకవర్గం మొత్తం ప్రచారం నిర్వహిస్తున్నారు. అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ బీజేపీకి ఓటేయాల్సి ఆవశ్యకతను వివరిస్తున్నారు. బీజేపీ ముఖ్య నాయకులు కూడా నేటి నుండి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 25వ తేదీ నుంచి జాతీయ స్థాయి నేతలు రంగంలోకి దిగుతారు. ప్రతి మండలంలో బహిరంగ సభలు, రోడ్ షోలతో మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారాన్ని మోత మోగించాలని బీజేపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. ఇక మునుగోడులో ప్రచారం చేసే వారి జాబితాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, మురళీధర్ రావు, విజయశాంతి, , ధర్మపురి అరవింద్, బాబు మోహన్ తదితర నేతలు ఉన్నారు.