తెలంగాణలో బీజేపీ టార్గెట్ 10
తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 10 సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. టార్గెట్ చేరుకునేలా తగిన నేపథ్యాన్ని ఇప్పటికే యంత్రంగా సిద్ధం చేస్తోంది. తెలంగాణలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై బీజేపీ దీమాగా ఉంది. సర్వేలన్నీ కూడా బీజేపీ గెలుపును ధ్రువీకరిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటికే పార్టీ శ్రేణులు సమయాత్తమవుతున్నారు. ఎవరు ఏ నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారన్న విషయంపై కూడా మరో వారం, పది రోజుల్లో స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో బీజేపీ 17 స్థానాల్లో విజయం కోసం అభ్యర్థుల ఎంపిక చేయాలని భావిస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పెద్ద ఎత్తున ఆశావాహులు పార్టీలో చేరుతున్నారు. ఇటీవల ఢిల్లీ కేంద్రం వరంగల్, జహీరాబాద్, ఖమ్మం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున నేతలు కాషాయం జెండా కప్పుకుంటున్నారు.

ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎవరు ఎన్నికల్లో విజయం సాధించగలరు? ఎవరు ప్రజలను ప్రభావితం చేయగలరు? పార్టీ సిద్ధాంతాల ఆధారంగా ఎవరు పనిచేస్తున్నారు? ఇలాంటి విషయాలపై పార్టీ ఫోకస్ పెంచింది. తెలంగాణలో బిజెపికి ముఖ్యంగా పట్టణ ప్రాంతంలో పట్టు కనిపిస్తోంది. అయోధ్య రామ మందిర్ నిర్మాణం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ బలపడినట్టుగా తెలుస్తోంది. సర్వేల అంచనాలతో బలమైన అభ్యర్థుల్ని బరిలో దించితే… విజయం నల్లేరుపై నడకేనన్న ఆలోచన ఉంది. మరీ ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు మథనం చేస్తున్నారు. ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని ఇప్పటికే ముఖ్య నేతలకు ప్రధాన నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, హోం మంత్రి అమిత్ షా నిర్దేశం చేశారు. అందుకు తగినట్టుగా కేంద్రం, తెలంగాణపై ఫోకస్ కూడా పెట్టింది.

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోల్చుకుంటే మెరుగైన ఫలితాలు సాధించాలని లక్ష్యంగా పార్టీ పెట్టింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో నాలుగు పార్లమెంట్ స్థానాలు గెలుచుకోగా… ఈసారి పార్టీ హైకమాండ్ 10 స్థానాలను టార్గెట్ చేస్తోంది. ఈ తరుణంలో తెలంగాణలో మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, ఉమ్మడి మెదక్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల్లో అన్ని సీట్లలోనూ గెలుపు అవకాశాలున్నాయని పార్టీ భావిస్తోంది. ఈ జిల్లాల్లో ఒక్క స్థానాన్ని కూడా ఓడిపోరాదని అంచనాలు వేసుకుంటోంది. అందుకోసమే పార్టీ నేతలను సన్నద్ధం చేసి… ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించింది. ఇకపై పార్లమెంట్ ఎన్నికల్లో విజయం కోసమే పనిచేయాలని శ్రేణులకు ఆదేశాలందాయి. లోక్ సభ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తే… ఆ తర్వాత తెలంగాణలో ఫైట్ కాంగ్రెస్, బీజేపీ మధ్యనే ఉంటుందన్న భావన కూడా పార్టీలో ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 14 శాతం ఓట్లు సాధించిన బీజేపీ, 8 స్థానాలను సాధించింది. అదే ఉత్సాహంతో లోక్ సభ ఎన్నికల్లో పోరాటం చేస్తే విజయం తధ్యమని పార్టీ భావిస్తోంది.

