కాపులకు చంద్రబాబు ఎంతో చేశారన్న బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ
కాపు రిజర్వేషన్ విషయంలో రాజకీయ పార్టీలు రెండు నాల్కల ధోరణి ఉండరాదన్నారు మాజీ మంత్రి, బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ… ఏపీలో 22 శాతం మంది ఉన్న కాపులు ఎన్నికల్లో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారన్నారు. కానీ కాపులు ఎప్పుడూ కూడా ఎన్నికల సమయంలో మాత్రమే అన్ని పార్టీలకు గుర్తొస్తున్నారన్నారు. వాస్తవానికి కాపులకు మేలు చేసింది చంద్రబాబు ఆయనకు ముందున్న సీఎంలు విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమేనని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై బీజేపీలో చర్చించి పార్టీ వైఖరి చెప్పి… ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఓబీసీ రిజర్వేషన్లలో… కాపుల అంశాన్ని చేర్చేలా చేస్తేనే న్యాయం జరుగుతుందని అన్నారు.

కాపు రిజర్వేషన్ల అంశం ఎప్పటినుంచో ఉన్న డిమాండ్ అని గతంలో ఓబీసీ రిజర్వేషన్ కేంద్ర పరిధిలో ఉండేదని ఇటీవల చట్ట సవరణ చేసి దానిని నిర్ణయించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చిందని అన్నారు. 1994లో విజయభాస్కర్ రెడ్డి కాపుల్లోని 14 ఉప కులాలకు విద్య ఉపకార వేతనాలను బీసీలతో సమానంగా ఇవ్వాలని దాదాపు రెండు కోట్ల నిధులతో జీవో ఇచ్చారని దానిని వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక 22 కోట్ల రూపాయలకు నిధులను పెంచడంతోపాటు, కాపులను బీసీల్లోకి చేర్చడంపై సామాజిక ఆర్థిక సర్వే కి కమిటీ వేశారని అన్నారు.

తర్వాత 2014లో సీఎంగా వచ్చిన చంద్రబాబు సమయంలో దానికి పూర్తి రూపం తీసుకొచ్చారని మళ్ళీ ఆయన కమిటీ వేసి నివేదిక తెప్పించుకున్నారని దానిని క్యాబినెట్లో చర్చించి ఆమోదించారని ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదంతో కేంద్రానికి పంపించారని అన్నారు. అదే సమయంలో కేంద్రం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రవేశపెట్టడంతో దానిలో ఐదు శాతం కాపులకు ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వం జీవో తీసుకువచ్చిందని వాస్తవంగా కాపుల హక్కుల కోసం శివశంకర్, మిరియాల వెంకట్రావుల మినహా మరెవరు చిత్తశుద్ధితో పోరాడలేదని అన్నారు.

