మెగా కృష్ణారెడ్డి కోసమే కాళేశ్వరమా?
కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే భద్రాచలం ముంపుకు గురైందన్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. వరదలతో ఎంతో మంది జీవితాలు ఆగం అయ్యాయి… కడెం ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆగ్రహించారు. మూడేళ్లుగా గేట్లు మార్చాలని చెప్తున్న కేసీఅర్ పట్టించుకోలేదు… గేట్లు మేనేజ్ చేసే సిబ్బంది 33 మంది ఉండాల్సిన చోట ముగ్గురు మాత్రమే ఉన్నారన్నారు వైఎస్ షర్మిల. ముఖ్యమంత్రి అయిన కొత్తలో భద్రాచలానికి వచ్చిన కేసీఆర్… మళ్లీ మొన్నటి వరదలకు అదికూడా వరదలు వచ్చిన వారం రోజుల తర్వాత తీరిక చేసుకుని వచ్చారని అన్నారు. వచ్చినా కూడా ఎవరిని పరామర్శించరలేదని… బాధితులతో మాట్లాడలేదని అన్నారు. కట్టమీద నిలబడి పిట్ట కథలు చెప్పి వెళ్లిపోయాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వరదలతో సర్వం కోల్పోయారు… నష్టపరిహారం ఇస్తామని మరో మోసం.. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదు ? అని నిలదీశారు. 10 వేలు కాదు 25 వేలు ఇవ్వాలన్నారు. సున్నా వడ్డీ, నిరుద్యోగ భృతి, దళిత బంధు, మూడెకరాల భూమి, ఉచిత విద్య ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం వల్లే ముప్పు ఉంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో ముందే ఎందుకు మాట్లాడుకోలేదని, స్వీట్లు తినిపించుకున్నప్పుడు తెలియదా అని మండిపడ్డారు. మాటనిలపెట్టుకోలేని హామీలతో కేసీఆర్ పబ్బం గడుపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరకట్ట నిర్మించి ఉంటే ఈ ప్రమాదం పొంచి ఉండేది కాదని అన్నారు వైఎస్ షర్మిల. కాళేశ్వరం గోడలు కూలిపోయాయి.. బాహుబలి మోటార్లు మునిగిపోయాయన్నారు. ష్టం జరగలేదని ప్రభుత్వం చెబుతున్నా… ఎంత నష్టం జరిగిందో.. ప్రతి సామాన్యుడికి తెలుసునన్నారు.
కాళేశ్వరం కట్టిన తరువాత బ్యాక్ వాటర్ ద్వారా వేలాది ఎకరాలు నీట మునిగాయని… ఒక్క ఎకరాకు నీరు ఇచ్చింది లేదన్నారు. అసలు ప్రాజెక్టు ఎందుకు కట్టారు.. లక్షల కోట్లు పెట్టి ప్రాజెక్ట్ కడితే వరి వేస్తే ఉరే సరి ఎందుకంటున్నారని ప్రశ్నించారు షర్మిల. కాళేశ్వరం టూరిజం స్పాట్ కోసం కట్టారా..? ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అన్నారని షర్మిల ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మెగా కృష్ణారెడ్డికి కేసీఆర్ ఎందుకు ఇచ్చారన్నారు. మెగా కృష్ణారెడ్డి కేసీఆర్ మనిషి..ఏ ప్రాజెక్టు అయిన మెగా కృష్ణా రెడ్డికే ఎందుకు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా కృష్ణారెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు షర్మిల.