Home Page SliderNational

లడఖ్ గవర్నర్ రాజీనామా వెనుక?

రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ ప్రకారం రాష్ట్ర హోదా, ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ లడఖ్ ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్న నేపథ్యంలో కేంద్రం ఈరోజు లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి కొత్త లెఫ్టినెంట్ గవర్నర్‌ను నియమించింది. భారత ఆర్మీ మాజీ బ్రిగేడియర్, ప్రస్తుత అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ బిడి మిశ్రా లడఖ్ ఎల్జీగా నియమితులయ్యారు. లెఫ్టినెంట్ గవర్నర్ రాధా కృష్ణ మాథుర్ శనివారం తన సిబ్బందికి వీడ్కోలు పలికిన తర్వాత లేహ్‌లోని తన కార్యాలయం నుండి నిశ్శబ్దంగా నిష్క్రమించారు. మహారాష్ట్ర గవర్నర్‌గా భగత్ సింగ్ కోష్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా రాధా కృష్ణన్ మాథుర్ రాజీనామాలను భారత రాష్ట్రపతి ఆమోదించినట్లు ఈ ఉదయం రాష్ట్రపతి భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

11 రాష్ట్రాలకు గవర్నర్లు, లడఖ్ యూటీ లెఫ్టినెంట్ గవర్నర్లను రాష్ట్రపతి నియమించారు. రాజ్ భవన్ నుంచి మాథుర్ తన లగేజీని ప్యాక్ చేసుకొని… ఎలాంటి కారణం చెప్పకుండానే వెళ్లిపోయారని తెలుస్తోంది. మాథుర్‌ను రాజీనామా చేయాల్సిందిగా కేంద్రం కోరిందా లేదా లడఖ్ ప్రజల ఆందోళనలతో వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. 69 ఏళ్ల రాధా కృష్ణ మాథుర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా మూడేళ్ల కంటే ఎక్కువగా పనిచేశారు. 2019 ఆగస్టులో జమ్మూ, కశ్మీర్ రాష్ట్ర హోదాను తొలగించి రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత మాజీ రక్షణ కార్యదర్శి మాథుర్ లడఖ్‌కు మొదటి లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులయ్యారు.
లేహ్‌లో 2019లో కేంద్రపాలిత ప్రాంత హోదాను వ్యతిరేకిస్తూ.. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నారు.