ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా బీసీసీఐ కఠిన నియమాలు..
బీసీసీఐ ఇటీవల ఆటగాళ్లకు, కోచ్‌లకు పది షరతులతో కఠినమైన నియమావళి రూపొందించింది. ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా మినహాయింపులు లేవని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా పర్యటన సమయంలో ఘోర పరాభవంతో ఈ సూత్రాలు సిద్ధం చేసింది. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో కూడా ఈ నియమాలు అమలు చేసింది. ఇవి సత్ఫలితాలు ఇవ్వడంతో ఇకపై వీటినే కొనసాగించాలని ఆటగాళ్లకు తెలియజేసింది. ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యక్తిగత కార్యదర్శి గతంలో జట్టుతో పాటే హోటల్‌లో బస చేయడం, జాతీయ సెలక్టర్లు ఉన్న కారులో తిరగడంతో అతనిని దూరం పెట్టాలని ఆదేశించింది. పీఏలకే కాకుండా కుటుంబసభ్యులను వెంట తీసుకెళ్లే విషయంలో కూడా అనుమతులు ఇవ్వలేదు. ఈ టోర్నీ మూడు వారాలే కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. క్రికెటర్లందరూ ఒకే హోటల్‌లో ఉంటూ రూమ్స్ షేర్ చేసుకోవాలని, జట్టు ప్రయాణించే బస్సులోనే అందరూ వెళ్లాలని ఆదేశించింది. వారి ఆహారం విషయంలో కూడా ప్రత్యేక చెఫ్‌లను కేటాయిస్తోంది.

