ప్రధాని మోదీతో బంగ్లా ప్రధాని భేటీ – కీలక చర్చలు
భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా రాష్ట్రపతి భవన్ గౌరవ వందనం స్వీకరించారు. హసీనాకు ప్రధాని మోదీ ఘనస్వాగతం పలికారు. భారత ప్రధానితో చర్చల నిమిత్తం వచ్చిన ఆమెకు త్రివిధ దళాల సైనిక వందనంతో ఆహ్వానం పలికారు. ఆమె నాలుగురోజుల పర్యటన నిమిత్తం భారత్‌లో అడుగుపెట్టారు. షేక్ హసీనా భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. కొవిడ్ కాలంలోనూ, ఉక్రెయిన్ రష్యా యుద్ధసమయంలోనూ భారత్ అందించిన సాయం చాలా గొప్పదని కొనియాడారు. ఇరుదేశాల మధ్య స్నేహసంబంధాలు కొనసాగిస్తున్నామని, ఇరు దేశాల ప్రజల అభివృద్ధి ఆకాంక్షలతో సమైక్యంగా ముందుకు సాగుతామని షేక్ హసీనా అన్నారు. పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం తమ ప్రధాన కర్తవ్యమని హసీనా తెలిపారు. భారతదేశం -బంగ్లాదేశ్‌లో సత్సంబంధాలు కలిగి దక్షిణ ఆసియా అంతటా ప్రజలకు మెరుగైన జీవనం లభించాలని కోరుకుంటున్నానన్నారు. అన్ని సమస్యల పైనా భారత్- బంగ్లాదేశ్ కలిసి పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

