NationalNews

తమిళనాడులోని ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం

తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించడం ద్వారా ప్రార్థనా స్థలాల స్వచ్ఛత, పవిత్రతను కాపాడినట్టవుతుందని కోర్టు పేర్కొంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లు ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది. కోర్టు ఆదేశాలను పాటించేలా భద్రతా సిబ్బందిని కూడా నియమించాలంది. సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ ఫోన్‌లు ప్రజల దృష్టి మరల్చడంతోపాటు దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమా నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని, తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను క్లిక్ చేయడంపై మహిళల్లో భయాందోళనలు నెలకొంటాయని ఆయన అన్నారు. ఆలయాలకు వచ్చే భక్తులు డ్రెస్ కోడ్‌ను పాటించాలని పిటిషనర్ కోర్టును కోరాడు.