NewsTelangana

రాజాసింగ్‌కు బెయిల్‌

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో 40 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బయటికి రానున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని, జైలు నుంచి విడుదలయ్యే సమయంలో ర్యాలీ నిర్వహించొద్దని, 3 నెలల వరకు సామాజిక మాధ్యమాల్లో వీడియోలు పోస్టు చేయొద్దని, మతాలను కించపరిచే వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. మహ్మద్‌ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో రాజాసింగ్‌ను ఆగస్టు 25వ తేదీన అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 5వ తేదీన ఆయనపై పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్‌ ఖైదీగా పంపించారు. పోలీసులు పీడీ యాక్ట్‌ నమోదు చేయడాన్ని రాజాసింగ్‌ సతీమణి ఉషాభాయి హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ కౌంటర్‌ను వ్యతిరేకిస్తూ రాజాసింగ్‌ తరఫు న్యాయవాది రవిచందర్‌ వాదనలు వినిపించారు. ఈ వాదనలు మంగళవారం పూర్తయ్యాయి. రాజాసింగ్‌పై వివిధ పోలీస్‌ స్టేషన్లలో ఇప్పటికే 100కు పైగా కేసులు ఉన్నాయి.