మేలుకున్న మునుగోడు ఓటరు.. నాయకుల బేజారు
రాష్ట్రంతో పాటు దేశ నాయకుల దృష్టి అంతా ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికపైనే పడింది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్‌గా భావిస్తున్న ఈ ఎన్నికలో విజయం సాధిస్తే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రమే మారుతుందని.. తెలంగాణాలో అధికారం ఖాయమని బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఆశతో ఉన్నాయి. రాజకీయ నాయకుల ఆలోచన ఇలా ఉంటే.. మునుగోడు ప్రజలు మరో విధంగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడైనా తమ సమస్యలు పరిష్కరించాలని, పరిష్కరిస్తామని హామీ ఇచ్చే నాయకులకే ఓటేస్తామని ఓటర్లు బ్యానర్లు పెట్టి మరీ స్పష్టం చేస్తున్నారు.

మంత్రిని నిలదీసిన ప్రజలు..
టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మీ గ్రామానికి రోడ్డు వేయిస్తామని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెబితే.. ఇంతకాలం అధికారంలో ఉండి ఏం చేశారంటూ అక్కడి ప్రజలు నిలదీశారు. దానికి మంత్రి సమాధానం చెప్పకుండా.. ‘నువ్వు ఆ వర్గమా..? ఈ వర్గమా..?’ అంటూ ఇష్యూను డైవర్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయినా వెరవని ప్రజలు తాము ఓటర్లుగా అడుగుతున్నామని.. మా సమస్యలు పరిష్కరించకుండా డబ్బులకు ఓట్లు కొనుగోలు చేస్తామంటే ఒప్పుకునేది లేదంటూ స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న మంత్రి వాళ్లను సముదాయించేందుకు ప్రయత్నించారు.

మీ డబ్బులు వద్దు.. రోడ్డు కావాలి..
చండూరు మండలం పడమటిపాలెం గ్రామానికి చెందిన ప్రజలు ‘మాకు మీరిచ్చే డబ్బులు వద్దు.. మా గూడానికి రోడ్డు కావాలి’ అని గ్రామ శివారులోనే బ్యానర్ పెట్టారు. గట్టుప్పల్ మండలం తేరట్‌పల్లి గ్రామానికి చెందిన బ్యాంకు కాలనీ ప్రజలు తమ కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇతర సమస్యలు పరిష్కరించే వారికే ఓటేస్తామన్నారు. NO ROAD – NO VOTE అని ఏకంగా బ్యానర్ పెట్టారు. కల్వలపల్లి నుంచి కాశవారి గూడెంకు తక్షణం రోడ్డు వేయాలని, గ్రామపంచాయతీ భవనాన్ని నిర్మించాలని కాశవారి గూడెం ప్రజలు డిమాండ్ చేశారు.

ఓటర్ల చైతన్యం..
30 ఏళ్లుగా ప్రభుత్వాలు మారినా.. ప్రజాప్రతినిధులు మారినా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని.. పరిష్కరించే వరకూ తమ కాలనీలో అడుగు పెట్టొద్దని, సమస్యను త్వరగా పరిష్కరించే వారికే ఓటేస్తామని స్పష్టం చేశారు. ఓటుకు రూ.10-40 వేలు ఇస్తూ ఓటర్లను బుట్టలో వేసుకుందామని ఆశించిన రాజకీయ నాయకులు.. ఓటర్ల చైతన్యాన్ని చూసి కంగు తింటున్నారు. 8 ఏళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నాయకులు మాత్రం సమాధానం చెప్పలేక వారిని తప్పించుకు తిరుగుతున్నారు. మొత్తానికి మునుగోడు ఓటరు మేలుకున్నాడంటూ రాజకీయ నాయకులు బేజారు అవుతున్నారు.