NationalNews

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్..?

కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షుడి ఎన్నిక అంశం గత ఏడాదిగా పతాక శీర్షిక అవుతోంది. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌ నియామకం కానున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ 17న జరగనున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికకుగాను… వచ్చే సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ కొత్త పార్టీ అధ్యక్షుడి ఎన్నిక గురువారం నుంచి ప్రారంభమవుతుంది. 20 ఏళ్లలో తర్వాత కాంగ్రెస్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురవుతోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు శశిథరూర్ ముందుకు వచ్చారు. ప్రస్తుత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి ఎటువంటి అభ్యంతరం లేకపోవడంతో ఆయన కూడా బరిలో దిగుతున్నారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ థరూర్‌కు ప్రత్యర్థిగా చెప్పుకోవాల్సి ఉంటుంది.

2019 లోక్ సభ ఎన్నికల ఓటమితో అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్ తప్పుకున్నప్పటి నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ వ్యవహరిస్తూ వస్తున్నారు. నాటి నుంచి పార్టీలోని పలువురు సీనియర్లు తిరుగుబాటు చేయడంతో.. కాంగ్రెస్‌లో గందరగోళం నెలకొంది. రాజస్థాన్ సీఎంగా ఉన్న అశోక్ గెహ్లాట్ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించేందుకు ముందుకు వచ్చినట్టుగా కన్పిస్తోంది. ఇప్పటికే రాజస్థాన్‌లో అటు గెహ్లాట్, ఇటు సచిన్ పైలెట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయ్. ఇలాంటి తరుణంలో పైలెట్‌కు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగిస్తే… అది రాష్ట్రంలో తనకు ఇబ్బందికరంగా మారుతోందని గెహ్లాట్ మధనపడతున్నట్టు తెలుస్తోంది. అందుకే ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకునేందుకు విముఖత చూపుతున్నట్టు తెలుస్తోంది. అయితే తాను ఏఐసీసీచీఫ్ గా వెళ్తే.. తనకు ఆమోదయోగ్యమైన వ్యక్తికే రాజస్థాన్ సీఎం పీఠం బాధ్యతలు అప్పగించాలని గెహ్లాట్ కోరుతున్నట్టు తెలుస్తోంది.

ఒకవేళ కాంగ్రెస్ పెద్దలు అందుకు అంగీకరించని పక్షంలో తాను కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటూనే… రాజస్థాన్ సీఎంగా ఉండాలన్న ఆలోచన సైతం వ్యక్తం చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. తాజాగా కాంగ్రెస్ ముఖ్యనేత సచిన్ పైలెట్… ఢిల్లీ రావడం… హైకమాండ్ పెద్దలతో సీఎం పీఠానికి సంబంధించిన వ్యవహారాన్ని చర్చించే అవకాశముంది. రాజస్థాన్ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే గడువు ఉండటంతో… పైలెట్‌కు అవకాశమివ్వాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఐతే ఇదంతా గెహ్లాట్ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏఐసీసీ ప్రెసిడెంట్‌గా నిలబడే ముందు.. రాహుల్ గాంధీయే పార్టీ పగ్గాలు స్వీకరించాలని మరోసారి కన్విన్స్ చేయాలని గెహ్లాట్ ప్రయత్నించనున్నారు. రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్ బాధ్యతలు తీసుకోవాలని గెహ్లాట్ బలంగా కోరుకుంటున్నారు. సెప్టెంబర్ 30 వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ జరుగుతుంది. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు పోటీలో ఉంటే అధ్యక్షుడి ఎన్నికలు అక్టోబర్ 17న నిర్వహిస్తారు. ఫలితాలు అక్టోబర్ 19న ప్రకటిస్తారు.