పిల్లలు స్కూలుకు వెళ్లనని మారాం చేస్తున్నారా.. ఇలా చేయండి
పిల్లలు స్కూలుకి వెళ్లనని మొరాయిస్తున్నారా.. కడుపునొప్పని, తలనొప్పని వంకలు పెడుతున్నారా.. చాలామంది తల్లులు ఎదుర్కొనే పెద్దసమస్యే ఇది. పిల్లల్ని టైమ్‌కి స్కూల్‌కి పంపేసరికి తల్లుల తలప్రాణం తోకకు వస్తుంది. వాళ్లకు సమయానికి వండి పెట్టి లంచ్ బాక్స్ ఇవ్వడం ఒకఎత్తైతే, వాళ్లను బుజ్జగించి స్కూలుకు పంపడం మరొక ఎత్తు.
పిల్లల్ని స్కూలుకు వెళ్లడానికి వాళ్లే చురుకుగా రెడీ అవ్వడానికి తల్లులు కొంత ఓపికగా నచ్చచెప్పాల్సి వస్తుంది. వాళ్లు స్కూలుకు వెళ్లకపోవడానికి అసలు సమస్య ఏమిటో తెలుసుకోవాలి. వారికి చదువుపై ఆసక్తి ఉందా లేదా, లేదంటే తోటి విద్యార్థులతో ఏదైనా సమస్య ఉందేమో, టీచర్లతో ఏమైనా ఇబ్బంది ఉందా అనే విషయాలు తెలుసుకోవాలి. స్కూలుకు అప్పుడప్పుడు వెళ్లడం, మిగిలిన విద్యార్థులతో మాట్లాడడం, ఉపాధ్యాయులతో మాట్లాడడం వంటి చర్యల ద్వారా అసలు సమస్య ఏమిటో తెలుసుకోవచ్చు. అంతేకానీ తోటిపిల్లలతో పోల్చి చూసి వాళ్లు చూడు ఎలా చదువుకుంటున్నారో, అక్కని, అన్నని చూడు ఎలా స్కూలుకు వెళ్లున్నారో అంటూ కోప్పడడం, బెదిరించడం మంచి పద్దతి కాదని పిల్లల మానసికనిపుణులు చెపుతున్నారు.
ఒకవేళ వారికి నిజంగా చదువుపై ఆసక్తి లేకపోతే దానిని పెద్దభారంగా భావిస్తే చదువును తప్పించుకోవాలని, స్కూలు ఎగ్గొట్టాలనీ సాకులు చెపుతూ ఉంటారు. వారికి తెలివి, చురుకుతనం బాగా ఉంటే వారిని ఆ అభిప్రాయం నుండి బయటపెట్టే ప్రయత్నాలు చేయాలి. బలవంతంగా పుస్తకాల ముందు కూర్చోపెట్టకుండా వారికి ఇష్టమైన ఆటల ద్వారా చదువును అర్థం చేసుకునే ప్రయత్నం చేయించాలి. జీవితంలో చదువు ఎంత విలువైనదో… దాని ప్రాధాన్యత ఏమిటో నిదానంగా తెలియజెప్పి ఆసక్తిని కలుగజేయాలి. వారికి ఉండే ఇతర అభిరుచులను ప్రోత్సహించాలి. బొమ్మలు వేయడం, ఆటలు ఆడడం, పుస్తక పఠనం, కంప్యూటర్ గేమింగ్, శారీరక వ్యాయామం, యోగా, పాటలు పాడడం, కరాటే, జూడో, నృత్యం, సంగీత పరికరాలు వాయించడం మొదలైన ఆసక్తులను ప్రోత్సహిస్తూ వాటిలో శిక్షణ ఇప్పించాలి. దీనితో వారిలో ఏకాగ్రత పెరిగి నెమ్మదిగా చదువుపై కూడా ఆసక్తి ఏర్పడుతుంది.
నువ్వు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అంటూ పెద్దల ఇష్టాయిష్టాలను వారిపై రుద్దకూడదు. వారి అభిరుచులు, అభిప్రాయాలు కూడా తెలుసుకోవాలి. వారిలో ఒత్తిడిని దూరం చేయడానికి అప్పుడప్పుడు వారిని ఇష్టమైన ప్రదేశాలకు తీసుకువెళ్లడం, ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం చేస్తూ, వాళ్లతో సరదాగా ఆటలు ఆడుతూ, కబుర్లు,కథలు చెపుతూ వారికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. వారికి జీవితంలో మాధుర్యాన్ని, సంతోషాన్ని రుచి చూపిస్తూ ఓపికగా ప్రవర్తిస్తే, వారికి చదువుపై ఆసక్తి కలగడమే కాదు. వారికి ఇష్టమైన వృత్తిని ఎంచుకొని జీవితంలో గొప్ప శిఖరాలను అందుకుంటారు.