అమేయ శక్తి.. అజేయ భక్తి… మేరా భారత్ మహాన్
తనువుకు తగిలిన గాయాలెన్నో. క్షామాలు, సంక్షోభాలు మరెన్నో. గుండెలపై ఎగసిపడ్డ ఉద్యమ జ్వాలలు, ఆందోళనలు, ఆవేదనలు ఇంకెన్నో. అన్నింటిని సహించింది.. భరించింది. ఏడున్నర దశాబ్దాలుగా ఎన్నో చేదు అనుభవాలను చవి చూసింది. అయినా పడి లేచింది. అంతర్జాతీయంగా తానేంటో నిరూపించుకుంది. అగ్ర రాజ్యాల సరసన చేరేందుకు అహరహం శ్రమిస్తూనే ఉంది. అన్ని రంగాలలో అమేయ విజయాలను సొంతం చేసుకుంటూ అడుగులు వేస్తూనే ఉంది. మేరా భారత్ మహాన్ అనేలా ఎదిగింది. దేశ ప్రజల గుండెల్లో భక్తి భావమై ఒదిగింది. అనన్య కీర్తి శిఖరమై వెలుగొందుతోంది. తన శక్తి ఏపాటిదో చాటుకుంటూనే ఉంది. అదే .. ఇప్పుడు అందరి చూపు భారత్ పై పడేలా చేసింది. ఉత్తుంగ తరంగమై ఎగసి పడుతున్న ప్రతిష్టను గమనించేలా చేస్తోంది. అంతా అబ్బురపడేలా అభివృద్ది దిశగా పయనాన్ని సాగిస్తూనే ఉంది.
శాంతి కాముకత, స్నేహశీలత, అన్ని దేశాలను కలుపుకు పోయే చాణక్యత, లౌక్యంతో మెలిగే చతురత .. ఇలా ఎన్ని చెప్పుకున్నా అన్ని గుణాలు భారత్ కే సొంతం. 75 వసంతాలలో ఎన్ని చేదు అనుభవాలను ఎన్నింటిని చవి చూసినా .. అన్నింటిని తట్టుకుని నిలబడ్డ గుండె నిబ్బరం ఒక్క భారత్ కే సొంతం. స్వాతంత్య్ర భారతంలో ఎన్ని రకాల చిచ్చులు రేగినా, విద్వంసాలు చెలరేగినా ప్రకృతి కన్నెర్ర చేసినా చలించకుండా నిలబడ్డ దేశం కూడా భారతే. ఈ ఏడున్నర దశాబ్దాలలో ఎంత మంది పాలకులు మారినా .. ఎన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి వచ్చినా అందరినీ భరించింది. తన మార్గంలోనే తాను పయనించింది. ఒకప్పుడు అప్పుల భారాన్ని మోసింది. ఆర్ధిక సంక్షోభాలనూ చూసింది. ఉగ్రవాద కదలికలను గమనించింది. తీవ్రవాదంతో తల్లడిల్లింది. శత్రు దేశాలు పన్నిన ఉచ్చుల్లో చిక్కుకోకుండా చాకచక్యంతో బయటపడుతూనే ఉంది. వారి ఎత్తులను సమర్ధవంతంగా తిప్పి కొడుతూనే ఉంది. గంగ పొంగినా.. హిమాలయాలు కూలినా చెక్కు చెదర లేదు. బాధతో కుమిలి పోలేదు. గాయమైన ప్రతిసారి ధైర్యాన్ని కూడ దీసుకుని అభివృద్ధి వైపు పరుగులు పెడుతూనే ఉంది. అందుకే ఇప్పుడు భారత్ అంటే ఓ అమేయ శక్తి. భారత్ అంటే అనన్య సమ్మోహనం. భారత్ అంటే ఓ అద్భుత వశీకరణం. ధైర్యంలో, స్ధైర్యంలో అందరికీ ఆదర్శం.
ప్రపంచంలో ఇపపుడు ఏ దేశాన్ని చూసినా ఏదో ఒక సంక్షోభ ఛాయలు కనిపిస్తూనే ఉన్నాయి. అగ్ర రాజ్యాలు సైతం అనేక సమస్యలతో కొట్టు మిట్టాడుతున్నాయి. చుట్టు పక్కల దేశాల నుండి ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉన్నాయి. ఒకరితో ఒకరికి పొసగని సమయంలో భారత్ ఇప్పడు పెద్దన్న పాత్ర పోషిస్తోంది. ఖండం ఏదైనా.. దేశం ఏదైనా తనవంతు సాయం చేసేందుకు ముందుంటూనే ఉంది. ఒకప్పుడు తాను పడ్డ కష్టం మరెవ్వరూ పడకూడదన్న నైజంతో ముందుకు సాగుతూనే ఉంది. మన కోసం మనం చేసుకున్న పని మనతోనే అంతరించి పోతుంది. కానీ.. పొరుగు వారి కోసం చేసే ఏ పనైనా కలకాలం చిరకాలం నిలిచి పోతుందన్న సూత్రాన్ని పాటిస్తూ .. పక్క దేశాలకు సాయం అందించేందుకు తనవంతు పాత్ర నిర్వహిస్తూనే ఉంది. ఆర్ధిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకతోపాటు బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్, భూటాన్, నేపాల్ ఇలా అనేక దేశాలకు అన్ని రకాలుగా బాసటగా నిలిచింది. 75 సంవత్సరాల కాలంలో అన్ని రంగాలో ఎనలేని అభివృద్ధి సాధించి ప్రపంచ దేశాలకే సవాళ్ళు విసిరే స్ధాయికి ఎదిగింది. 1945 తర్వాత ప్రపంచంలో రెండు బలీయమైన కూటములు ఏర్పడ్డాయి. ఒక వర్గానికి అమెరికా .. మరొక కూటమికి రష్యా నాయకత్వం వహిస్తూ వచ్చాయి. ఈఈ కూటములలో చేరాలని అనేక రకాలుగా చిన్న చితకా దేశాలపై ఒత్తిడులు పెరిగాయి. అలాగే వర్ధమాన దేశాలపై కూడా బలంగా ఒత్తిళ్ళు వచ్చాయి. కానీ.. వారి ఒత్తిళ్ళకు తలొగ్గకుండా అలీనోద్యమాన్ని నిర్మించడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఘనత భారత్ దే. అలా ప్రపంచ దేశాలలో భారత్ తన ప్రత్యేకతను చాటుకుంది. ఇప్పుడు అలీన దేశాల సంఖ్య 120కి చేరింది. బ్రిక్స్ దేశాల కూటమిలో కూడా భారత్ తన వాణిని వినిపిస్తూనే ఉంది. బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికాలతో కలిసి ద్వైపాక్షిక, వాణిజ్య అంశాలపై విస్తృత సంబంధాలను ఏర్పాటు చేసుకుంది. అన్ని దేశాలతో మైత్రిని కొనసాగిస్తూ .. ఓ విలక్షణతను చాటుకుంటోంది. ఓ సూపర్ పవర్ గా ఎదుగుతోంది.
ఆధ్యాత్మికత, యోగా, విద్య, వైద్య రంగాలతో పాటు సైనిక వ్యవస్ధలో అజేయ శక్తిగా ఎదిగింది. ఎన్నో అంశాలలో ఇప్పుడు ప్రపంచంలోని అన్ని దేశాలు భారత్ ను స్పూర్తిగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేసుకోవడంలో భారత్ అనుసరించిన మార్గాలు అన్నీ సఫలీకృతం అయ్యాయి. సైనిక పాటవాన్ని పెంచుకుంటూ .. త్రివిధ దళాలను అన్ని రకాలుగా అజేయంగా మారుస్తోంది. ముఖ్యంగా విద్యా రంగంలో ఎంతో సమున్నతిని సాధిస్తోంది. అమెరికా, రష్యా, కెనడా, చైనా, ఆస్ట్రేలియా, యూకే తదితరదేశాలలో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న వారిలో అత్యధికులు భారతీయులే. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న ఇతర దేశీయులలో భారతీయులు గణనీయంగా ఉన్నారు. ఇక అనేక దేశాలలో కీలక భూమిక పోషిస్తున్న వారిలో భారతీయులే అధికం. రాజకీయ రంగంలో కూడా అనేక దేశాల్లో పోటీ పడుతున్నారు. యోగా వంటి సాంప్రదాయ విద్యను అనుసరిస్తున్న దేశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే ప్రాణాయామం వంటి క్రియలను అన్ని దేశాలు అనుసరించేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక వైద్య రంగంలో భారత్ ఓ శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా కరోనా కష్ట కాలంలో అనేక రకాల వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకు వచ్చి ప్రపంచ దేశాలు అన్నింటికీ సరఫరా చేసే స్ధాయికి ఎదిగింది. ఎన్ని రకాలుగా కయ్యానికి కాలు దువ్వినా పాకిస్తాన్, చైనాను కట్టడి చేయడంలో భారత్ లౌక్యంగా వ్యవహరిస్తోంది. నిరంతరం సరిహద్దుల్లో అలజడులను సృష్టించి .. అన్ని రకాలుగా ఇ్బందులు పెట్టాలని చూసినా .. అంతర్జాయ సమాజం ముందు ఆయా దేశాలను దోషులుగా నిలపడంలో కృతకృత్యమవుతూనే ఉంది. దేశంలో అలజడులు సృష్టించి, విధ్వంసాలకు తెగించే ఉగ్రమూకల పని పట్టడంలో కూడా, భారత్ ఎంతో తెగువతో వ్యవహరిస్తోంది. ఇక పట్టణ, గ్రామీణాభివృద్దిలో ఎంతో పురోగతి సాధించింది. రవాణా వ్యవస్ధను అన్ని రకాలుగా అభివృద్ధి చేసింది.
75 సంవత్సరాల కాలంలో వాణిజ్య వ్యాపార రంగాలలో భారత్ ఎంతో పురోగతి సాధించింది. అనేక దేశాలతో వర్తక వాణిజ్య లావాదేవీలను కుదుర్చుకుంది. పలు దేశాలకు పెద్ద ఎత్తున ఎగుమతులు సాగిస్తూ ఆర్ధిక పటుత్వానికి బాటలు వేసుకుంది. ఇదే పంథాను అనుసరిస్తే.. ఇదే మార్గాన్ని అవలంభిస్తే రానున్న కోద్ది సంవత్సరాల్లో భారత్ అగ్ర దేశంగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోంది. సైనిక మేధోపరమైన అఁశాలలో ప్రపంచదేశాలకు నాయకత్ం వహించే స్ధితికి భారత్ చేరబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడు దేశంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రపంచ దేశాలన్నీ ఓ గౌరవ భావంతో వీక్షిస్తున్నాయి. ఎంతోకాలం పేదరికంలో మగ్గిన దేశం.. ఇప్పుడు సంపన్న దేశంగా మారుతోంది. ప్రభుత్వాలు చేపట్టిన, చేపడుతున్న అనేక వినూత్న పథకాలు ఆరోగ్యవంతమైన సమాజానికి బాటలు వేస్తున్నాయి. కేవలం ఎనిమిదేళ్ళ కాలంలోనే ఎంతో అభివృద్ధి జరిగింది అనడానికి .. అ్పుడు కేవలం 400 స్టార్టప్ కంపెనీలే ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య పది వేలకు పెరిగింది. ఇదే భారత్ పురోగతికి ఓ కారణంగా చెప్పుకోవచ్చు. బ్రీటీష్ వలస పాలకుల కాలంలో ఓ పథకం ప్రకారం ధ్వంసమైన సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పుడు తిరిగి జవసత్వాలను కూడదీసుకుంటున్నాయి. ఇది భారత్ సాధిస్తున్న అమేయ విజయం. ఈ అమృతోత్సవ్ సమయంలో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన విషయం. విమర్శలను ఎక్కుపెట్టే వారు కూడా ఇప్పుడు మన భారత్ స్ధాయి ఎలా ఉందో అర్ధం చేసుకోవాల్సిన అంశం. నువ్వూ నేనూ కలిస్తే మనం. మనం మనం కలిస్తే జనం. జగతి కోసం.. ప్రగతి కోసం. దేశ ఔన్నత్యం కోసం జరుగుతున్న మహా యజ్ఞంలో నడు కట్టాలి నువ్వూ నేనూ మనందరం. మేరా భారత్ మహాన్.