Andhra PradeshNews

ఉసూరు మంటున్న ఊరి బడులు

Share with

◆ఏపీలో విద్యారంగం పయనం ఎటు ?
◆ విలీనం పేరుతో ప్రాథమిక విద్యారంగం నిర్వీర్యం
◆ తల్లిదండ్రులతో చర్చించకుండా ప్రభుత్వం నిరంకుశ వైఖరి

పాఠశాలలు తెరిచి పది రోజులు కావొస్తోంది. బడులు తెరిచీ తెరవక ముందే అమ్మ ఒడి సొమ్ము జమైంది. బడికొస్తున్న పిల్లలందరికీ విద్యా కానుక సంచి సిద్ధంగా ఉంది. నిజానికిదంతా చూచాక సీతాకోక చిలుకల్లా పిల్లలు రెక్కలు విప్పుకొని బడిలో వాలాల్సింది. బడి వేయి పూల తోటలా కన్నుల పండగ చెయ్యాల్సింది. కానీ జరుగుతున్నదేమిటి. పదేళ్ళు కూడా నిండని పసివాళ్ళు ధర్నాలకు దిగుతున్నారు. అమ్మానాన్నలు బడులకు తాళాలు వేస్తున్నారు. పాఠశాల యాజమాన్య కమిటీలు బడి మూస్తే ఖబడ్దార్‌ అంటూ తీర్మానాలు చేస్తున్నాయి. టీచర్లు కన్నీళ్ళు ఉగ్గబట్టుకుంటున్నారు. కింది అధికార్లు బిక్క మొహం వేస్తున్నారు. పై అధికార్లు మాత్రం బింకం ప్రదర్శిస్తున్నారు. రెండు లక్షల మంది పిల్లల్ని వదులుకోలేక ఊరిబడులు ఉసూరుమంటున్నాయి.

ప్రాథమిక పాఠశాలల్ని రెండు ముక్కలు చేసి ఒక ముక్కను అంగన్‌వాడీల్లో, మరో ముక్కను హైస్కూళ్లలో కలపాలన్న వితండ విధాన ఫలితమిది. మొండిగా, మొరటుగా, హడావుడిగా అమలు చేస్తున్న నూతన విద్యా విధాన పర్యవసానమిది. ఆంధ్రప్రదేశ్లో ఎన్ఈపీ అమలు పేరుతో చేపడుతున్న ప్రాథమిక పాఠశాల విభజన ఉపసంహరించుకోవాలని డిమాండ్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించకుండా పాఠశాలలను విలీనం చేయటం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమన్న పేరెంట్స్ మండిపడుతున్నారు. ఇప్పటికే ఎయిడెడ్ విద్యా వ్యవస్థ కుప్ప కూలటం పాఠశాలల విలీనంతో వేలాది ఎస్జీటీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రద్దమని నేపథ్యంలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుంది. నాడు-నేడు పేరుతో పాఠశాలలకు మంచి వసతులు కల్పించారు. చూడముచ్చటగా తీర్చిదిద్దారు. మిగతావీ అలా మారాలని పెద్ద డిమాండు వస్తోంది. ప్రభుత్వానికి దీనివల్ల మంచి పేరు వచ్చింది.

అయితే ఇప్పుడు జరుగుతున్నదేమిటి వీటి నుంచి పిల్లల్ని ఏ వసతులూ లేని హైస్కూళ్ళకు తరలిస్తున్నారు. ఎందుకింత ఖర్చు చేసినట్టు ఎందుకు వీటిని పిల్లల్లేక బోసిపొయ్యేలా చేస్తున్నట్టు ఇది ఊళ్ళో అతి సామాన్యులకు కూడా అర్ధం కావడం లేదు. కరోనా తెచ్చిన కష్టాలతో దేశమంతా ప్రైవేట్‌ స్కూళ్ళ నుంచి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల బాటపట్టారు. దేశంలో 40 లక్షల పైగా పిల్లలు ఇలా బడులు మారారని యు-డైస్‌ చెబుతోంది. ప్రభుత్వ స్కూళ్లలోకి మారడమే గాదు బడా స్కూళ్ళ నుంచి బడ్జెట్‌ స్కూళ్ళకు కూడా ప్రైవేట్‌ రంగంలో పిల్లలు తరలి వెళ్ళారు. మన రాష్ట్రంలో 7 లక్షలకు పైగా సర్కారు స్కూళ్ళలోకి పిల్లలు అదనంగా వచ్చిన మాట వాస్తవం. ప్రభుత్వ విద్యార్ధులు 43 లక్షలకు పెరిగి 60 శాతం దాటడం చరిత్రలోనే మొదటిసారి. అమ్మ ఒడి, నాడు-నేడు వల్ల రాష్ట్రంలో ఈ పెరుగుదల కొంత ఎక్కువగా ఉండడాన్ని కూడా ఎవ్వరూ కాదనలేరు. ఇప్పుడు ‘తరలింపు’ మొదలవ్వడంతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. బడి ఉంటుందో లేదో, తాము వుంటామో వుండమో తెలియనప్పుడు టీచర్లు ఈ పిల్లలకు ఏ నమ్మకం కల్గించగలరు.

నిర్బంధంగా టీసీ ఇమ్మన్న ఆదేశాలతో ఉపాధ్యాయులు సైలెంట్ అయిపోయారు. పూర్తి లెక్కలు ఇంకా రావాల్సి ఉందిగానీ పిల్లలు ప్రైవేట్‌ బాట పట్టడం మాత్రం స్పష్టంగా కన్పిస్తోంది. మరి ప్రభుత్వం చివరకు ఏం సాధించినట్టు. ఈసారి పదో తరగతి పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత బాగా పడిపోయింది. దీంతో నష్టపోయిందంతా పేద పిల్లలు. ప్రైవేట్‌ స్కూళ్ళ పిల్లలు తొంబై శాతం పైగా పాసయ్యారు. ఇలా ఎందుకు జరిగిదంటే పరీక్షలు పకడ్బందీగా నిర్వహించామంటూ అధికార్లు బడాయికి పోతున్నారు. ఎంత మంది పేద పిల్లలు ఫెయిలయితే అంత బాగా పరీక్షలు జరిగినట్టా… అంటే అసలు సంగతి అదిగాదు. కరోనాలో చిన్నారులకు రెండేళ్ల చదువు పోయింది. పాఠశాలల కుదింపు మూసివేతల నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వంపై ఆగ్రహం ఉప్పొంగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరి మారుతుందో లేదో వేచి చూడాల్సి ఉంది.