యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇండియా జపం, 20 సార్లు ప్రస్తావన
ఇండియా మార్కెట్ యాపిల్ ప్రాడెక్టులకు అత్యంత కీలకమన్నారు యాపిల్ ఇంక్ చీఫ్ టిమ్ కుక్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ప్రధాన మార్కెట్, తయారీ కేంద్రంగా కూడా ఇండియా ఎలా దూసుకుపోతుందన్నది గమనించాలని సహచరులు, వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నారు. గత నెలలో యాపిల్ మొదటి రెండు భారతీయ రిటైల్ అవుట్‌లెట్‌ల ప్రారంభోత్సవానికి అధ్యక్షత వహించిన కుక్, ఇండియా మార్కెట్, ఆదాయ మార్గాలను వెల్లడించారు. సహచరుల కాన్ఫరెన్స్ కాల్‌లో సుమారు 20 సార్లు భారతదేశం పేరును ప్రస్తావించారు. భారతదేశంలో మార్చి త్రైమాసికంలో కంపెనీ రికార్డు అమ్మకాలను నమోదు చేసింది. ఇది మొత్తం వృద్ధిని పెంచడానికి మార్కెట్‌పై పెరుగుతున్న ఆధారపడటాన్ని ప్రతిబింబిస్తుందన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది.

“మధ్యతరగతిలోకి చాలా మంది ప్రజలు వస్తున్నారు, భారతదేశం ఒక టిపింగ్ పాయింట్‌లో ఉందని నేను నిజంగా భావిస్తున్నాను” అని యాపిల్ సీఈవో కుక్ అన్నారు. మార్కెట్లో వస్తున్న చైతన్యం నమ్మశక్యం కావడం లేదన్నాడు. 140 కోట్ల జనాభా ఉన్న ఇండియాలో యాపిల్ మార్కెట్‌ను వేగవంతంగా పెంచుకోవాలని సంస్థ భావిస్తోంది. మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న ఆదాయాలు, వినియోగదారుల సంఖ్యను ఇండియాలో యాపిల్ కష్టమర్లను పెంచుతుంటే… ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు శాచ్యురేషన్ పాయింట్‌కు చేరాయి. ఆ తరుణంలో ఇండియా మాత్రం కొత్త మార్కెట్ కేంద్రంగా కన్పిస్తోంది. కంపెనీ ఆదాయ ప్రకటనలలో భారతదేశ ఆదాయం పెరుగుతోందని అంచనా వేస్తోంది. ఇండియాలో యాపిల్ అమ్మకాలు ఏడాదిలో సుమారు 6 బిలియన్లు అంటే… సుమారుగా 50 వేల కోట్ల జరిపినట్టు బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదించింది.

ఇండియాలో పెద్ద ఎత్తున కార్మికులను రిక్రూట్ చేసుకోవాలని కూడా యాపిల్ భావిస్తోంది. అమెరికా, చైనా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున యాపిల్ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించడానికి మార్గాలను అన్వేషిస్తోంది. యాపిల్‌కు చాన్నాళ్ల నుంచి భాగస్వాముగా ఉన్న సంస్థలు, చైనా కర్మాగారాల నుండే వస్తున్నాయ్. ఐతే అమెరికా-చైనా మధ్య ప్రతికూల పరిస్థితుల్లో గత ఏడాది నుంచి చైనా బయట, యాపిల్ అసెంబ్లింగ్ యూనిట్లను సిద్ధం చేసుకోవాలని సంస్థ భావిస్తోంది. ఇండియాలోనూ అందుకు తగిన ఏర్పాట్లు సంస్థ చేసుకుంటోంది.

