Andhra PradeshHome Page Slider

జనం చెంతకు…జగన్

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జిల్లాల పర్యటనకు బీజం పడింది. మే నెల చివరి నుండి లేదా జూన్ నుండి ఆయన జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు అందుకు సంబంధించిన కసరత్తు ప్రారంభమైంది. సీఎం జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు ఏ ఏ జిల్లాలో ఏమేం సమస్యలు ఉన్నాయన్న దానిపై శాఖల వారీగా అధికారులు తెలియజేయాలని సీఎం కార్యాలయం కోరింది. ఈ మేరకు సచివాలయంలోని వివిధ శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో అధికారులు హెచ్ ఓ డి లతో సమావేశమై జిల్లాల వారీగా సమస్యలను వెలికితీస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ముఖ్యమంత్రి హామీల అమలు కమిటీ కూడా ఇప్పటివరకు ఆయా జిల్లాలకు సీఎం జగన్ ఎన్నిసార్లు వెళ్లారు, ఆ సందర్భంలో ఆయన ఏమేం హామీలు ఇచ్చారు, వాటిలో ఎన్ని హామీలు అమలు అయ్యాయి, ఇంకా ఎన్ని హామీలు పెండింగ్‌లో ఉన్నాయి, ఉంటే ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి ఇలా పలు అంశాలపై ఒక సమగ్ర నివేదికను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా ఈ నెల 29వ తేదీ నేటితో జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ముగియనుంది. పార్టీ నిర్దేశించిన ఒక కోటి 60 లక్షల కుటుంబాలను చేరుకొని గత ప్రభుత్వ పాలనకు ఈ ప్రభుత్వ పాలనకు మధ్య తేడా వివరించే కార్యక్రమం పూర్తవుతుంది. ఇది పూర్తవుతున్న నేపథ్యంలో మే నెల తొమ్మిదో తేదీ నుండి జగనన్నకు చెబుదాం అనే మరో కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. ఒకవైపు సీఎం జగన్ జిల్లాల పర్యటన మరోవైపు నిత్యం ప్రజలతో మమేకమయ్యేలా గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్నే మా భవిష్యత్తు, మా నమ్మకం నువ్వే జగనన్న, జగనన్నకు చెబుదాం ఇలా పలు కార్యక్రమాలతో సీఎం జగన్ 2024 ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.

ఇటీవల సీఎం జగన్ సచివాలయ కన్వీనర్లు, గృహ సారధులను నియమించి వారికి ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. అంతేకాకుండా ప్రజల్లోకి వెళ్లి వారు చేయాల్సిన పనులను కూడా వివరించారు. ఈ పనులను ఏ విధంగా వివాదం లేకుండా చేయాలన్న దానిపై కూడా వారికి అవగాహన కల్పించారు. రీజనల్ కోఆర్డినేటర్లు నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జిలు ఇలా పలు దశలో వారికి శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసుకున్న వీరంతా ఇప్పుడు ప్రజాక్షేత్రంలో దిగిబోతున్నారు. మే ఒకటో తేదీ నుండి వారి పనులు పూర్తిస్థాయిలో నిర్వహించబోతున్నారు. జగన్ జిల్లా పర్యటన నేపథ్యంలో నియోజకవర్గాల్లో నేతల మధ్య ఉన్న అభిప్రాయ బేధాలను సమసి పోయే విధంగా రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ అబ్జర్వర్లు వారి మధ్య సయోధ్య చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఇన్చార్జిలు ఈ అంశంలో చొరవ తీసుకొని ముందుకు సాగాలని కూడా పార్టీ నుండి త్వరలో ఆదేశాలు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల ఏడాది కావడంతో జగన్ దూకుడు పెంచి ప్రజలతో వివిధ కార్యక్రమాల ద్వారా మమేకం కానున్నారు. ఎన్నికల ఏడాది ఎంత జగన్ జనంలోనే ఉండబోతున్నట్లు తెలుస్తోంది.