వైసీపీకి మరో ఎంపీ మాగుంట రాజీనామా? ఒంగోలు బరిలో చెవిరెడ్డి!?
సీఎం జగన్ అభ్యర్థుల్ని మార్చుతూ దూకుడు పెంచుతుంటే మరోవైపు వైసీపీ ఎంపీలు తమ దారి తాము చూసుకుంటున్నారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పార్టీ మారడం దాదాపు ఖాయంగా కన్పిస్తోంది. గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి ఒంగోలు ఎంపీగా విజయం సాధించిన మాగుంట తాజాగా, ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నారు. సీఎం జగన్ తీరుతో విసిగిపోయిన ఆయన పార్టీ మారుతున్నట్టు జిల్లా నేతలు చెబుతున్నారు. ఒంగోలు జిల్లా మొత్తాన్ని ప్రభావితం చేయగల, మాగుంట రాజీనామాతో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయని పార్టీ నేతల్లో ఆందోళన ఉంది.

మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఢిల్లీ నుంచి గల్లీ స్థాయిలో పలు పార్టీలతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. మాగుంట తొలిసారి ఎంపీగా 1998లో కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో విజయం సాధించారు. 2014లో స్వల్ప ఓట్లతో ఆయన వైవీ సుబ్బారెడ్డిపై ఓడిన… తిరిగి 2019లో వైసీపీ నుంచి విజయం సాధించారు. గత కొద్ది రోజులుగా వైసీపీలో ఒంగోలు వ్యవహారం రచ్చకు కారణమవుతోంది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి, మాగుంటకు మంచి సంబంధాలున్నాయి. మాగుంట తనయుడు రాఘవ రెడ్డి ఒంగోలు పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తున్నారు. అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఒంగోలు, దర్శి, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాలలో పర్యటిస్తున్నారు.

మరోవైపు మాగుంట దెబ్బతో ఒంగోలు ఎంపీగా సీఎం జగన్ సన్నిహితుడు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని చంద్రగిరి నుంచి రెండు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. తాజాగా ఆయన తనయుడు మోహిత్ రెడ్డిని చంద్రగిరి ఇన్ చార్జిగా పార్టీ నియమించింది. ఒంగోలులో చెవిరెడ్డికి పరిస్థితులు ఏమేరకు సహకరిస్తాయో చూడాలి. వైసీపీ నుంచి పలువురు నేతలను ఎంపీగా బరిలో దించాలని పార్టీ కోరినప్పటికీ, మాగుంటపై పోటీకి చాలా మంది వెనుకాడారు. దీంతో సీఎం జగన్, తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన చెవిరెడ్డిని బరిలో దించింది.

