Andhra PradeshNews

టీచర్లకు అగచాట్లు… తప్పని నిమిషం టెన్షన్

Share with

◆ గురువులను టార్గెట్ చేసిన జగన్ ప్రభుత్వం
◆ పోయిన సంవత్సరం వేసవి సెలవులు విషయంలోనూ తిప్పలు
◆ ప్రస్తుతం సెల్ఫీ విధానం ద్వారా హాజరుపై సర్వత్ర విమర్శలు
◆ పనిచేయని సర్వర్లు అందని సిగ్నల్స్
◆ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయ సంఘాలు

ఆంధ్రప్రదేశ్ లో ఉపాధ్యాయులుపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో పిఆర్సీ, సీపీఎస్ రద్దుపై ఫిబ్రవరిలో జరిగిన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టినప్పటి నుండి ఉపాధ్యాయులపై వివిధ రకాలుగా ఒత్తిళ్లు మొదలయ్యాయని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన ఫేషియల్ రికగ్నైజేషన్… (ముఖ హాజరు విధానం) వల్ల వారిని ఇంకా ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించిందని విశ్లేషకులు అంటున్నారు. విద్యారంగంలో అనేకమైన మార్పులకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం, కేవలం నిమిషం ఆలస్యమైన అరపూట ఆబ్సెంట్ గా లెక్క కట్టాలని నిర్ణయించడంపై, ప్రభుత్వం కావాలనే తమను టార్గెట్ చేసిందని ఉపాధ్యాయ సంఘాలు అంటున్నాయి.

సాధారణంగా వివిధ పోటీ పరీక్షల్లో నిరుద్యోగులు పరీక్ష రాయటానికి, అలానే విద్యార్థులు ఇంజనీరింగ్ ఫార్మసీ వంటి ప్రవేశాలకు రాసే పరీక్షల్లో కచ్చితమైన సమయానికి హాజరు కావడం కోసం ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాల్లోకి అనుమతి ఇవ్వమని ఆంక్షలు, నిబంధనలు పెట్టడం ఇన్ని సంవత్సరాలుగా అందరూ చూస్తున్నారు. కానీ ఏపీలో విచిత్రంగా విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పే గురువులకు ఉదయం 9 గంటలకు ఒక నిమిషం ఆలస్యమైనా ఆరోజు సెలవు కిందే పరిగణించేలా ప్రభుత్వం నిర్ణయించడం పట్ల కచ్చితంగా వారిపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం పాల్పడుతుందనే వాదనలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. గతంలో బయోమెట్రిక్ విధానం ఉన్నప్పుడు సమయం కొంత అటు ఇటు అయిన హాజరు తీసుకునేవారు కానీ ఇప్పుడు 9 గంటలకల్లా ముఖ హాజరు పడకపోతే ఆటోమేటిక్ గా సెలవు పడిపోయే యాప్ తేవడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హాజరు విషయంలో ప్రభుత్వం టీచర్లపై ఒత్తిడి చేస్తుందని ఎలాంటి పరికరాలు సమకూర్చకుండా ముఖ హాజరు విధానం అమలు చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు సమంజసం అని ఉపాధ్యాయ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కొత్త హాజరుకు తామంతా వ్యతిరేకం కాదని సొంత ఫోన్లలో ఫోటోలు తీసుకోవాలనటం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు.

ఉపాధ్యాయుల వ్యతిరేకతను బేఖారతు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ముఖ హాజరు యాప్ తొలి రోజు విఫలమైందనే చెప్పుకోవాలి. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం అన్ని ప్రాంతాల్లో ఈ యాప్ పనిచేయలేదు కచ్చితంగా ఉదయం 9 గంటలకల్లా యాప్‌లో సెల్ఫీ ఫోటోతో పాటు హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం సూచించడంతో ఉపాధ్యాయులు యాప్ ద్వారా హాజర నమోదు చేయడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తొలి రోజు కేవలం 10 శాతం మంది మాత్రమే హాజరు నమోదు చేయగలిగారని సమాచారం. నెట్ సదుపాయం కొంతమందికి లేకపోవడం సర్వర్ బిజీ రావటంతో యాప్ కూడా కొంతమందికి డౌన్లోడ్ కాలేదు. ఇప్పటికే విద్యార్థుల హాజరు అప్ లోడ్ బాత్రూంలు, స్కూల్ పరిసరాలు, మధ్యాహ్నం భోజనం ఫోటోలు, కూడా అప్లోడ్ చేయాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు గందరగోళంలో ఉన్నారు. హాజరు నమోదుకు అవసరమైన పరికరాలు నెట్ సౌకర్యంతో ప్రభుత్వమే ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. మరి ప్రభుత్వం ఇదే విధానాన్ని కొనసాగిస్తుందా, కొన్ని మార్పు చేర్పులు చేస్తుందా, అవసరమైన పరికరాలు సమకూరుస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.