Andhra PradeshNews Alert

జగన్ పేరు వద్దు.. అంబేద్కర్ పేరు ముద్దు

Share with

పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి ఉద్దేశించిన విదేశీ విద్య పథకానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ పేరును తొలగించి..జగనన్న విదేశీ విద్య పథకం గా మార్చడంపై దళిత నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. విదేశీ విద్య పథకానికి అంబేద్కర్‌ పేరును కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ ఎస్సీ సెల్‌ నేతలు నిన్న నిరవధిక దీక్షకు దిగారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం నుంచి ప్రదర్శనగా వెళ్లి తాలూకా సెంటరులోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద దీక్షకు కూర్చొన్నారు.

టీడీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెస్‌ రాజు దీక్షలను ప్రారంభించి ప్రసంగించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరుతో విదేశీ విద్య పథకం గతంలో ప్రవేశపెడితే సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక విదేశీ విద్యకు అంబేద్కర్ పేరు తొలగించి జగనన్న విదేశీ విద్య పేరు పెట్టుకోవటం సిగ్గు చేటు అని మండిపడ్డారు. దళితులను ఉన్నత విద్యకు దూరం చేసేందుకు సీఎం జగన్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జగన్‌ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే దళితుల సంక్షేమం కోసం ఉద్దేశించిన 29 పథకాలను రద్దు చేశారన్నారు. ఏ రాజ్యాంగం పై ప్రమాణం చేసి జగన్ మోహన్ రెడ్డి సీఎం గా గద్దె నెక్కారో, ఆ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పేరు తొలగించి, తన పేరు పెట్టుకోవడం దళితులను అవమానించడమే అన్నారు. విదేశీ విద్యకు తిరిగి అంబేద్కర్‌ పేరును కొనసాగించే వరకు దీక్షకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామన్నారు. గుంటూరు పార్లమెంట్‌ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు మైనర్‌బాబు, టీడీపీ ఎస్సీ సెల్‌ నియోజకవర్గ అధ్యక్షుడు కనికళ్ల చిరంజీవి, క్రిస్టియన్‌ సెల్‌ అధ్యక్షుడు యర్రగుంట్ల భాగ్యారావు ఆధ్వర్యంలో పలువురు నేతలు దీక్ష చేపట్టారు.