Andhra PradeshNews

బాబు గారూ సర్వేలు చూస్తున్నారా?

Share with

◆ ఇండియా టీవీ, ఇండియా టుడే సర్వే ఫలితాల్లో వైసీపీదే హవా
◆ తాజా సర్వేలతో టీడీపీలో అంతర్మదనం
◆ సీట్లు తగ్గిన మళ్లీ అధికారం జగన్ దేనా ?
◆ 175 స్థానాల్లో గెలవాలని జగన్ ప్రణాళికలు
◆ తాజా సర్వేలతో జోష్‌లో జగన్ అండ్ కో

దేశంలో ప్రస్తుతం ప్రజల మూడ్ ఎలా ఉంది, ప్రజలు ఏ పార్టీకి మళ్లీ అధికారం ఇవ్వబోతున్నారు అనేదానిపై ఇటీవల ఇండియా టీవీ, ఇండియా టుడే సర్వేలు నిర్వహించి ఫలితాలను వెల్లడించాయి. దేశ వ్యాప్తంగా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ పక్షాలు 307 స్థానాల్లో గెలుస్తాయని, యూపీఏ పక్షాలు 125 స్థానాల్లోనూ, ఇతరులు 111 స్థానాల్లోనూ విజయం సాధిస్తారని ఇండియా టుడే సర్వే తేల్చింది. ఇక ఆంధ్రప్రదేశ్‌ 25 పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ 18, టీడీపీ 7 స్థానాలు గెలుస్తాయని ఆ సర్వే విశ్లేషించింది. తాజాగా చేసిన సర్వేల ప్రకారం ఏపీలో 25 స్థానాలకు 18 పార్లమెంట్ స్థానాలను వైసీపీ చేజిక్కించుకుంటుంది అనే ఫలితాల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో అంతర్మధనం మొదలైందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ప్రజల్లో జగన్ పాలనపై కొంతమేర వ్యతిరేకత వ్యక్తం అవునవుతున్నప్పటికీ ఈ సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలు తెలుగుదేశం పార్టీ అధినాయకత్వాన్ని ఇరకాటంలో పడవేస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో పొలిటికల్ వాతావరణం వేడెక్కింది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ మధ్యకాలంలో పూర్తిగా ప్రజల్లో ఉంటున్న చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ద్వితీయశ్రేణి నాయకులు కార్యకర్తలు తాజాగా ప్రకటించిన సర్వే ఫలితాలతో నిరుత్సాహంలో ఉన్నట్లు సమాచారం. పార్టీ కోసం ఎంత కష్టపడినా ఈసారి జరిగే ఎన్నికల్లో మరల ప్రతిపక్షంలోనే కూర్చోవాలా అనే ఆలోచనలలో వారు ఉన్నారు. ఇప్పటికే కేసుల భయంతో బయటకు రాని కొంతమంది తెలుగుదేశం నాయకులు ఈ సర్వే ఫలితాలతో మరింత వెనకడుగు వేసే అవకాశాలు ఉన్నాయని గుసగుసలు వినపడుతున్నాయి.

తాజా సర్వే ఫలితాలతో జగన్ జోష్‌లో ఉన్నారని మిషన్ 175 నియోజకవర్గాల గెలుపు దిశగా జగన్ వేగంగా ప్రణాళికలు రచిస్తున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల్లో 22 పార్లమెంటు 151 అసెంబ్లీ స్థానాలు గెలిచిన వైసీపీ ఈసారి జరగబోవు ఎన్నికల్లో సీట్లు తగ్గినా కూడా మళ్లీ అధికారంలోకి వచ్చి రెండోసారి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారన్న తాజా సర్వే ఫలితాల నేపథ్యంలో ఆ పార్టీ కార్యకర్తలు నాయకులు మరింత ఉత్సాహంతో పని చేయనున్నారు. ఇంకా ఎన్నికలకు కొన్ని నెలలు సమయం ఉండటంతో జగన్ తన సొంత సర్వేలతోపాటు, ప్రశాంత్ కిషోర్ టీం ద్వారా, ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రతి నియోజకవర్గంపై దృష్టి సారించి అక్కడ ఉన్న పరిస్థితులను తెలుసుకొని స్థానిక ఎమ్మెల్యే, నాయకులతో మాట్లాడుతూ వారిని మరింత ఉత్సాహంగా పనిచేసేలా ప్రోత్సహిస్తున్నారు.

ప్రభుత్వ పథకాలను అన్ని విధాల ప్రజలకు అందేలా చేస్తూ పార్టీ పరంగా కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ జగన్ ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల నాటికి వెనుకబడిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేసి అనుకున్న లక్ష్యం జగన్ సాధిస్తారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరి సర్వేలలో ఇప్పటికే వెనుకంజలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్నికల నాటికి పుంజుకుంటుందా, రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు సరికొత్త వ్యూహాలు అనుసరించి వైసీపీకి చెక్ పెడతారా అనేది వేచి చూడాల్సి ఉంది.