పోలవరం జాప్యానికి జగన్ సర్కారే కారణం!
ఆంధ్రప్రదేశ్ జీవనాడీ పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణనికి సంబంధించి కేంద్రం సంచలన కామెంట్ చేసింది. పోలవరం పూర్తి కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసమర్ధతే కారణమని కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలుకొట్టింది.
మంగళవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నిర్మాణ, కాంట్రాక్టు నిర్వహణ సక్రమంగా లేకపోవడం, వ్యూహాత్మక ప్రణాళిక లేమి, ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో సమన్వయం లేకపోవడంతో పాటు కరోనా మహమ్మారి కారణంగానూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతోందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ … పీపీఏ ఏర్పాటు చేసిన కమిటీ తేల్చినట్లు బిశ్వేశ్వర్ వెల్లడించారు
ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రాజెక్టు పూర్తి కావలసి ఉండగా… గడువులోగా అది జరగలేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ ఏడాది ఏప్రిల్‌లో నివేదిక ఇచ్చిందని 2024 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తిచేయాలని సవరణ లక్ష్యాన్ని సూచించింది అని పేర్కొన్నారు. అయితే ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి, పర్యవేక్షణకు అనేక చర్యలు తీసుకున్నామని… పనుల పురోగతిని… సమస్యల పరిష్కారానికి పీపీఏ ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ఇప్పటి వరకు పీపీఏ 14 సార్లు, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ) 20 సార్లు, నిపుణుల కమిటీ 7 సార్లు సమావేశమైనట్లు తెలిపారు. ప్రస్తుతం హెడ్ వర్క్స్ పనులు 77 శాతం, కుడి ప్రధాన కాలువ పనులు 93 శాతం, ఎడమ ప్రధాన కాలువ పనులు 72 శాతం పూర్తయ్యాయని కేంద్ర మంత్రి వెల్లడించారు