InternationalNews

లంకపెత్తనం విక్రమసింఘేదే

Share with

శ్రీలంక గత కొన్ని రోజులుగా ఆర్థిక సంక్షోభంతో అతలాకుతలమవుతోంది. ప్రజల వద్ద డబ్బులు ఉన్నా నిత్యావసరాలు దొరకడం గగనమైపోతోంది. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో పాలకులు చూపిన నిర్లక్ష్యమే దీనికి కారణమని విమర్శలు వచ్చాయి. కరోనా కల్లోలంతోపాటు శ్రీలంక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అక్కడి ప్రజలను అంధకారంలోకి నెట్టేశాయి. తీవ్ర సంక్షోభంలో ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. నిత్యవసర వస్తువులు కొనుక్కోవడం కూడా కష్టంగా మారింది. గతంలో ఎన్నడూ లేనంతగా దేశంలో విపరీత పరిస్థితులు నెలకొన్నాయి. ఆహారం చమురు విద్యుత్ సంక్షోభంతో శ్రీలంక ఇతర దేశాల సహాయం కోసం ఎదురు చూస్తోంది. ప్రజలు తిరుగుబాటు చేసి అధ్యక్ష భవనాన్ని ముట్టడించారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే దేశం విడిచి పారిపోయాడు. శ్రీలంక ప్రజలు రాజపక్స కుటుంబపాలన వల్ల చాలా విసుగు చెందారు. వారు పదవులనుండి వైదొలగేవరకు చాలా ఆందోళనలు చేసారు.

ఇలాంటి పరిస్థితులలో ఈరోజు శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎన్నికయ్యారు. అధికారపార్టీ ఎస్‌ఎల్‌పీపీకి చెందిన దులస్ అలహాప్పెరుమా, జనతా విముక్తి నాయకుడు అనూర కుమార దిశనాయకే కూడా అధ్యక్షబరిలో ఉన్నారు. ప్రతిపక్షనేత ఎస్‌జేబీ నాయకుడు సాజిత్ ప్రేమదాస అలహాప్పెరుమాకే మద్దతునిచ్చాడు. అందువల్ల అతనికే విజయం వరిస్తుందని అనుకున్నారందరూ. మొత్తం 225 స్థానాలకు గాను  219 ప్రజాప్రతినిధుల ఓట్లు ఉండగా మెజార్టీ కోసం 113 రావలసి ఉంది. అందులో రణిల్‌ విక్రమసింఘేకు 134 ఓట్లు లభించాయి.  ఓటింగ్ రహస్య ఓటింగ్ విధానంలో జరిగింది. దీంతో శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్‌ విక్రమసింఘే ఎన్నికయ్యారు. ఆయన త్వరలోనే శ్రీలంక ఎనిమిదో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 8వ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్‌ విక్రమసింఘే ఆ దేశ ప్రధానిగా కూడా పని చేశారు. కొన్ని రోజులకు ముందు రణిల్‌ విక్రమసింఘే ప్రధాని పదవికి రాజీనామా చేశారు.  

అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్‌ విక్రమసింఘే మాట్లాడుతూ దేశం చాలా తీవ్ర సంక్షోభంలో ఉందని… అనేక సవాళ్లున్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధితో చర్చలు జరుపుతామని పార్లమెంటులో ప్రజలనుద్దేశించి అన్నారు. ఈయన ఎన్నికపై ఆందోళనకారులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. వ్యతిరేఖ నినాదాలు చేస్తున్నారు. మరి దేశ ఆర్ధిక, సామాజిక వ్యవస్థను ఈయన ఎలా మారుస్తాడో, ఆందోళనలను ఎలా ఎదుర్కొంటాడో వేచి చూడాల్సిందే…