అమిత్ షా.. అభినవ సర్దార్ పటేల్
హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం తెలంగాణ ప్రజల విజయమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు. హైదరాబాద్‌లో జాతీయ జెండాను తొలిసారి నాటి కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎగురవేశారని.. 74 ఏళ్ల తర్వాత మళ్లీ నేటి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎగుర వేశారని గుర్తు చేశారు. అమిత్ షాను అభినవ సర్దార్ పటేల్ అని అభివర్ణించారు. విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని బీజేపీ పాతికేళ్లుగా పోరాడుతోందని.. ఆ కల ఇప్పుడు నెరవేరిందన్నారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని చెప్పారు. ఇప్పుడు నామమాత్రంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న కేసీఆర్ సర్కారు ఇంతకాలం విమోచన దినోత్సవాన్ని ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు.

