మమ్మల్ని వేధించకన్నా… ఎమ్మెల్యేను వేడుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సాక్షిగా కోదాడ అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు మరోసారి భయటపడ్డాయి. స్ధానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన కుటుంబాన్ని మానసికంగా వేధింస్తున్నారని ప్రోటోకాల్స్ పాటించకుండ తనని అవమనించడంతో పాటు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, సూర్యాపేట జిల్లా కోదాడ మున్సిపల్చైర్పర్సన్వనపర్తి శిరీష కంటతడి పెట్టారు.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో పట్టణ ప్రథమ పౌరురాలిగా గుర్తింపు ఇవ్వకుండా కోదాడ ఎంపీపీ, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్‌తో అవమానపర్చారని ఆమె తన నివాసంలో ప్రెస్‌మీట్‌పెట్టి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య పుర పాలక వర్గంలో చీలికలు తెచ్చి, అభివృద్ధి పనులకు ఆటంకం కలిగిస్తున్నారని శిరీష ఆరోపించారు. పార్టీ కార్యక్రమాలకు ఉద్దేశపూర్వకంగా తమను దూరంగా పెట్టి మానసిక క్షోభకు గురిచేస్తున్నారని వివరించారు. “అన్నా మల్లన్నా నీ సోదరిగా వేడుకుంటున్నా నా కుటుంబనికి మనశ్శాంతి లేకుండా చేయకన్నా” అంటూ శిరీష కన్నీటి పర్యంతమయ్యారు.
వివాదనికి కారణమిదే…
ఉదయం మున్సిపల్ కార్యాలయంలో జెండా వందన కార్యక్రమంలో భాగంగా ఛైర్‌పర్సన్‌తో పాటు కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లు , పట్టణ వాసులు హాజరయ్యారు. జెండా ఆవిష్కరించేందుకు పుర ఛైర్ పర్సన్ సమాయత్తమవుతున్న సమయంలో ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. ఈ లోపు ఎమ్మెల్యే మల్లయ్య మున్సిపల్ కార్యాలయం మీదుగా ఆర్డీవో కార్యాలయానికి వెళ్లిపోయారు. దారిలోని మున్సిపల్ కార్యాలయానికి రాకపోవడంతో అక్కడున్న వారు కమిషనర్‌తో వాదనకు దిగారు. కమిషనర్ వ్యవహారశైలిపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సమయం దాటినా ఎమ్మెల్యే రాలేదంటూ ఛైర్‌పర్సన్ శిరీష జెండాను ఆవిష్కరించారు. తర్వాత ఆమె అక్కడి నుంచి గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి వెళ్లారు. ఈ సమయంలో ఎమ్మెల్యే, మార్కెట్ కమిటీ ఛైర్‌పర్సన్ బుర్ర సుధారాణి, కోదాడ ఎంపీపీ కవితారెడ్డి అక్కడి వచ్చారు. వారు లోపలికి వస్తున్న క్రమంలో తనను పక్కకు నెట్టివేసి అవమానించారని మున్సిపల్ ఛైర్‌పర్సన్ శిరీష ఆరోపించారు. పట్టణ ప్రథమ పౌరురాలి హోదాలో కార్యక్రమానికి హాజరైతే మండలానికి చెందిన మహిళా ప్రజాప్రతినిధులు అవమానకరంగా వ్యవహరించారని విమర్శించారు. మనస్తాపంతో అక్కడి నుంచి గాంధీ విగ్రహం ఎదుట మౌనంగా నిరసన వ్యక్తం చేశారు.