Andhra PradeshNews

డైవర్షన్ పాలిట్రిక్స్… అమరావతి పాదయాత్ర టు హెల్త్ యూనివర్శిటీ…

అవును నిజమే.. రాజకీయ నాయకులకు తెలిసినన్ని కుట్రలు మరెవ్వరికీ తెలియవు. అవును నిజమే.. రాజకీయం ఎలా చేయాలో మన పార్టీలకు తెలిసినంతగా మరెవరికీ తెలియవేమో.. అవును నిజమే.. రాజకీయం వృత్తిగా.. రాజకీయం వ్యాపారంగా.. రాజకీయం ఒక విలాసంగా.. రాజకీయాన్ని ఒక అభరణంగా మార్చుకుంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏది రాజకీయమో… ఏది అరాజకీయమో అర్థం కాని దుస్థితి నెలకొంది. ఏపీలో 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన నాటి నుంచి ఎన్నో ఘటనలు.. మరెన్నో ఉదంతాలు రాష్ట్రగతిని మార్చేస్తూ వచ్చాయ్. వైఎస్సార్ వారసత్వంతో రాజకీయాల్లో ప్రవేశించిన జగన్మోహన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీతో విభేదించి సొంత పార్టీ పెట్టుకొని ఎన్నికల బరిలో నిలిచారు. 2014లో అనూహ్యంగా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి చేతిలో తలొంచారు. అధికారంలోకి వస్తామని భావించి.. అధికారాన్ని దూరం చేసుకున్న వైఎస్ జగన్… విశ్రమించలేదు. అధికారమే లక్ష్యంగా.. ప్రజల అజెండా అమలు చేస్తానంటూ ప్రజల్లోనే ఉంటూ రాజకీయాలు చేసి… అనూహ్యంగా 2019 ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించారు. ఎన్నికల్లో విజయం సాధించిన కొద్దిసేపటికే జగన్ అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. పరిపాలన అంటే ఏంటో ఆరు నెలల్లో చూపిస్తానన్నారు. 175 ఎమ్మెల్యే స్థానాల్లో 151, 25 ఎంపీ స్థానాల్లో 22 చోట్ల గెలిపించినందుకు ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రతినబూనారు. ఆయన చెప్పినట్టుగానే పాలన సాగిస్తారని ప్రజలు సైతం విశ్వసించారు. ఎన్నికలయ్యే వరకు మాత్రమే రాజకీయాలని.. ఆ తర్వాత అభివృద్ధి, సంక్షేమమే అజెండా అని జగన్ విస్పష్టమైన ప్రకటన చేశారు.

కానీ పరిస్థితులు మారిపోయాయ్. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన జగన్‌.. అప్పటి వరకు ఆయనకు ఉన్న ఎన్నో పాజిటివ్ అంశాలు ఒక్కొక్కటిగా నెగిటివ్ అవుతూ వచ్చాయి. రాష్ట్రం అప్పుల్లో ఉందన్న ఆందోళన ఉన్నా… ఆయన సంక్షేమ పథకాలు కొనసాగించి.. పేద ప్రజల మనసు చూరగొన్నారు. నేరుగా లబ్ధిదారులకు బటన్ నొక్కి ఎకౌంట్లో మనీ పడేలా చేసి.. లబ్ధిదారుతో నేరుగా కాంటాక్ట్ పెట్టేసుకున్నారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా లబ్ధిదారుల ఎకౌంట్లలో మనీ వేస్తున్నారన్న భావన కలిగించారు. ఒక్క పింఛన్ డబ్బులు తప్పించి మిగతా పథకాలన్నీ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ పథకం ద్వారా చెల్లింపులు జరుపుతూ రాజకీయ చతురత ప్రదర్శించారు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఆల్ ఆఫ్ ద సెడన్.. అమరావతి రాజధానికి ప్రత్యామ్నాయం.. పాలన వికేంద్రీకరణ అంటూ మూడు రాజధానుల కాన్సెప్ట్ తెరపైకి తెచ్చారు. అప్పటికే ఎన్నో సంక్లిష్టతలతో సతమతమవుతున్న పరిస్థితుల్లో రాజధాని అమరావతితోపాటు మరో రెండు రాజధానులంటూ అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటన పెనుదుమారం రేపింది. జగన్ ప్రకటనను వెనక్కి తీసుకోవాలంటూ అటు ప్రతిపక్షం, అమరావతి రైతులు గర్జించారు. మొదట్లో సన్నాయి నొక్కులు నొక్కిన బీజేపీ సైతం అమరావతి విషయంలో మరో స్టాండ్ లేదని తేల్చి చెప్పింది. అమరావతి పోరాటంలో రైతులకు సంఘీభావం చెప్పాలని కూడా పార్టీ నేతలను ఢిల్లీ పెద్దలు ఆదేశించారు. ఐతే సీఎం జగన్ మాత్రం వికేంద్రీకరణ తప్ప మరో ఆప్షన్ లేదని చెప్పుకుంటూ వస్తున్నారు. మొత్తం వ్యవహారం హైకోర్టు, సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఇక అమరావతి రైతులు మూడేళ్లుగా ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇటీవల ఆందోళనలకు వెయ్యి రోజులు పూర్తవడంతో అమరావతి టు అరసవిల్లి మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం అనుమతించకపోయినా… కోర్టుల ద్వారా అనుమతి తీసుకొని ప్రజలకు తమ గోస చెప్పేందుకు రైతులు నడుంకట్టారు. ఓవైపు రాజధాని వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్న తరుణంలో ప్రభుత్వం మాత్రం మళ్లీ మళ్లీ మూడు రాజధానుల పాట పాడుతూనే ఉంది. త్వరలోనే వైజాగ్ కేపిటల్‌గా పాలన సాగబోతోందంటూ మంత్రులు కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. ఓవైపు రాజధాని గురించిన రగడ పెద్ద ఎత్తున సాగుతుంటే… ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు అంశం తెరపైకి వచ్చింది. ఎందుకో తెలియదు కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచనా ధోరణి అంతా టిట్ ఫర్ టాట్ అన్న చందంగా ఉన్నట్టుగా కన్పిస్తోంది. పాలకులకు విశాల హృదయం ఉండాలని కౌటిల్యుడు చెప్పిన నీతివచనాలు ఎంత మాత్రం ఆయన చెవికెక్కలేదన వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీగా మార్చేశారు. కేబినెట్‌లో బిల్లు పెట్టేశారు. అసెంబ్లీలో చట్టం చేసేశారు. ప్రభుత్వాలు, ప్రజలను ప్రభావితం చేసే ఏదైనా నిర్ణయం తీసుకోడానికి ఎంతో తర్జనభర్జనపడతాయ్. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం అసలే సంకోచించరన్న విషయం తాజా ఉందంతంతో వెలుగులోకి వచ్చేసింది. ఐతే, ఎన్టీఆర్ పై తనకున్న ప్రేమను జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వివరించారు. అదే సమయంలో చంద్రబాబు, మరో జర్నలిస్ట్ ఇలా మాట్లాడుకున్నారంటూ అసెంబ్లీలో వీడియోలు ప్లే చేసి మంత్రులు, సీఎం కామెంట్స్ చేసుకుంటూ తమ అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అండ్ కో అంటే తమకే ఎన్టీఆర్ అంటే ఎక్కువ ప్రేమ ఉందంటూ చెప్పుకొని తరించిపోయారు. ఇదంతా ఎందుకు చేశారా.. అని జనం తలలుపట్టుకుంటున్నారు.

ఎన్టీఆర్ పై ప్రేమ ఉన్న వ్యక్తి… ఎన్టీఆర్ పేరుతో ఉన్న హెల్త్ యూనిర్శిటీ పేరు మార్చి ఏం సాధిస్తారన్న చర్చ ప్రజల్లో నెలకొంది. ఎన్టీఆర్ పేరు కృష్ణా జిల్లాకు పెట్టాలని ఎవరు కోరారని వారంటున్నారు. మీకు నచ్చినట్టుగా… మీకు కావాల్సినట్టుగా ఏదైనా చేస్తామంటే ఎలా… అంటూ ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలు ఎప్పుడు ఎలాంటి టర్న్ తీసుకుంటాయో ఊహించడానికి కష్టంగా ఉంటుంది. కానీ ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రజల్లో విద్వేషాలు కలగవా… సోషల్ మీడియాలో ఇప్పటికే వస్తున్న పోస్టులను చూడాలంటే కూడా భయమేసేలా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రేపు తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే హెల్త్ యూనివర్శిటీ పేరును మళ్లీ ఎన్టీయార్‌ పేరే పెడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ అవకాశం కూడా జగన్మోహన్ రెడ్డి టీడీపీకి ఇవ్వరని వైసీపీ నేతలు ఆఫ్ ద రికార్డ్ చెబుతున్నారు. తాను మూడు రాజధానులంటూ చెప్తున్న ప్రతీసారి.. తనకు కౌంటర్ గా అమరావతి ఆందోళనలను టీడీపీ ఉధృతం చేస్తోందన్న దుగ్ధతోనే జగన్‌ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు కొందరు నేతలు చెబుతున్నారు. అమరావతి మహాపాదయాత్ర ప్రజల్లోకి చేరకుండా ఉండేలా.. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి… చంద్రబాబు కంటే తమకే ఎన్టీఆర్ అంటే ఎక్కువ గౌరవం ఉందని చాటుకోవాలని జగన్ అనుకుంటున్నారన్న లైన్ విన్పిస్తున్నారు. కానీ ఇక్కడ జగన్ అర్థం చేసుకోవాల్సింది చాలానే ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఏపీ ప్రజలు.. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయకత్వాన్ని ఆమోదించారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంగీకరించారు. అన్నింటికీ మించి… ఎన్టీఆర్ వారసుడిగా చంద్రబాబు… ఆయన వారసుడిగా నారా లోకేష్ పార్టీ బాధ్యతలు చేపట్టాలని కూడా కోరుకుంటున్నారు. ఇలాంటప్పుడు ఎన్టీఆర్ విషయంలో నాడు చంద్రబాబు ఇలా.. ఫలానా వాళ్లు అలా అని చెప్పడం వల్ల ఒరిగేదేముందన్న అభిప్రాయం ఉంది.

ఇప్పటికే వైసీపీ అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లు కావొస్తోంది. 90 శాతం సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పుకుంటున్న ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలతో చలికాచుకోవడం దేనికన్న చర్చ జోరుగా సాగుతోంది. అమరావతి రాజధానిగా కరెక్ట్ కాదని.. మూడు రాజధానులే కరెక్ట్ అని ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే.. అప్పుడు మాత్రమే మీరు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్న విపక్షాల వర్షన్ సరైందని ప్రజలు భావిస్తున్నారు. వాస్తవానికి నాడు అమరావతికి జై కొట్టిన మీరు… ఇప్పుడు నై అమరావతి అంటే ఎలా కుదురుతుందని వారంటున్నారు? ఇప్పటికే రెండేళ్లు కరోనా కష్టాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైందన్న భావన ఉంది. ఇప్పుడిప్పుడు ప్రజలు ఇళ్లలోంచి బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త సంక్షోభాలు సృష్టించి ఆందోళనలను మరింత ఉధృతమయ్యేలా చేయడం ఎందుకన్న అభిప్రాయం కలుగుతోంది. అమరావతి మహాపాదయాత్ర అంశం సైడ్ అయ్యాక… మళ్లీ జగన్మోహన్ రెడ్డి ప్రజల కోరిక మేరకు, లక్ష్మీ పార్వతి అభ్యర్థన మేరకు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీ పేరు తిరిగి పెట్టినా.. జరగాల్సిన నష్టం జరగకమానదు కదా.. రాజకీయాలు చేయండి. రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని దెబ్బతీయండి. కానీ సెంటిమెంట్‎ రాజకీయాలు తేనె పూసిన కత్తుల్లాంటివి. కొన్నిసార్లు అవి ఎవరైతే సృష్టించారో వారినే కబళించేస్తాయ్.